TGRTC: నిర్లక్ష్యపు బస్సు నడిచేదెప్పుడో!

ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్‌ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

Published : 30 Jun 2024 06:06 IST

బస్‌భవన్‌ వెనుక నెలల తరబడి పిచ్చిమొక్కల మధ్యే ఛాసిస్‌లు
బస్సు బాడీ తయారీకి మీనమేషాలు
ఉద్యోగుల కొరత, వనరుల లేమితో సమస్యలు

చిత్రంలో కనిపిస్తున్నవి ఆర్టీసీ బస్సుల కోసం కొనుగోలు చేసిన ఛాసిస్‌లు.. వీటికి బాడీ (గూడు) నిర్మిస్తే రోడ్కెక్కుతాయి. బాడీ బిల్డింగ్‌ కోసం పంపకపోవడంతో ఇవన్నీ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌ వెనుక ఖాళీ స్థలంలో ఇలా పిచ్చి మొక్కల మధ్య నెలల తరబడి ఉండిపోయాయి. నిరుపయోగంగా పడి ఉన్న వీటి సంఖ్య అయిదో, పదో కాదు.. దాదాపు వందకుపైనే.. 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులు పెరుగుతుంటే బస్సుల సంఖ్యా పెరగాలి. టీజీఎస్‌ఆర్టీసీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్టీసీలో పదేళ్ల క్రితం 10,479 బస్సులుంటే ఇప్పుడా సంఖ్య 8,574. ఈ బస్సుల్లోనూ కాలం చెల్లినవి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గతంలో రోజూ సగటున 44-45 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ సంఖ్య 55 లక్షలకు పెరిగింది. ఈ రద్దీతో చాలా రూట్లలో ఆర్టీసీ బస్సుల్లో కాలు పెట్టే సందు కూడా ఉండట్లేదు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆర్టీసీ పెంచలేకపోతోంది. మరోవైపు కొనుగోలు చేసిన బస్సులనూ ప్రయాణికులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. కొన్ని సమయాల్లో ఒక్కో బస్సులో 150 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రమాదకర పరిస్థితులున్నాయి.

మియాపూర్‌ బస్‌బాడీ యూనిట్‌

ప్రైవేటు వారు కట్టినప్పుడే ‘గూడు’

ఆర్టీసీ ఏడాది క్రితం 1,325 బస్సులు కొనుగోలు చేసింది. సొంత యూనిట్‌లో, ప్రైవేట్‌ యూనిట్‌లలో ఛాసిస్‌లకు బాడీ తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తోంది. ఇంకా దాదాపు 305 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉన్నట్లు సమాచారం. ఎక్కువగా ప్రైవేటు బస్‌బాడీ యూనిట్లపైనే ఆధారపడుతోంది. బస్‌బాడీ యూనిట్లో ఛాసిస్‌పైన ఫ్లోరింగ్, పైకప్పు నిర్మాణం, సీట్ల బిగింపు, గ్లాస్‌ అమరిక, రంగులు వేసి తీర్చిదిద్దడం, సీట్లు బిగించడం వంటి పనులు చేస్తారు. బాడీ నిర్మాణం 45 రోజుల్లో పూర్తవుతుంది. హైదరాబాద్‌లో 40కి పైగా ప్రైవేటు బస్‌బాడీ యూనిట్లు ఉన్నాయి. అయితే ఆర్డర్లు భారీగా ఉండటంతో ఆ యూనిట్లు టీజీఎస్‌ఆర్టీసీకి ప్రాధాన్యమివ్వట్లేదని సమాచారం. దీంతో ఆర్టీసీ నుంచి వెళ్లిన ఛాసిస్‌లకు బాడీ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పనులు పూర్తయితే 180 దాకా పల్లెవెలుగు బస్సులు, 125 వరకు మెట్రోడీలక్స్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సమాచారం.

బక్కచిక్కిన బస్‌బాడీ యూనిట్‌

బస్సు తయారీ సంస్థలు ఛాసిస్‌లనే అందిస్తాయి. బాడీని ఆర్టీసీయే నిర్మించుకోవాలి. ఈ పని చేసేందుకు ఆర్టీసీకి మియాపూర్‌లో 12 ఎకరాల స్థలంలో బస్‌బాడీ యూనిట్‌ ఉంది. 1988లో ప్రారంభించారు. అప్పట్లో ఉద్యోగుల సంఖ్య దాదాపు 770 మంది. అప్పట్లో నెలకు 150-180 బస్సులకు బాడీని అమర్చేవారు. రిటైర్మెంట్లే తప్ప నియామకాల్లేకపోవడంతో ఈ యూనిట్‌ బక్కచిక్కిపోయింది. ఉద్యోగుల సంఖ్య మూడేళ్ల క్రితం మూడొందలకు, ప్రస్తుతం 121కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్‌ సామర్థ్యం నెలకు 24-25 బస్సుల బాడీ నిర్మాణానికే పరిమితమైంది. ఫలితంగా ఆర్టీసీ ప్రైవేటు వర్క్‌షాప్‌లపై ఆధారపడాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని