Seethakka: దివ్యాంగులకు ‘జాబ్‌పోర్టల్‌’

దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దరఖాస్తులు అందులో అప్‌లోడ్‌ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

Published : 28 Jun 2024 05:59 IST

ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు 
హెలెన్‌ కెల్లర్‌ జయంత్యుత్సవంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో చిన్నారికి వినికిడి పరికరాన్ని అమరుస్తున్న మంత్రి సీతక్క. చిత్రంలో శైలజ, కాంతి వెస్లీ, అద్దంకి దయాకర్, వాకాటి కరుణ తదితరులు

రవీంద్రభారతి, అక్బర్‌బాగ్,న్యూస్‌టుడే: దివ్యాంగులకు జాబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దరఖాస్తులు అందులో అప్‌లోడ్‌ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోధికుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘హెలెన్‌ కెల్లర్‌’ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపుతాయన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూ.75 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. గతంలో దివ్యాంగులుగా గుర్తించడానికి 7 రకాల లోపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారని, ఇప్పుడు 21 రకాల సమస్యలను గుర్తిస్తున్నామన్నారు. సదరం క్యాంపులకు, మీసేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా ఇంటి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అనంతరం క్రీడల్లో రాణించిన, పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. అనంతరం దివ్యాంగులకు అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోధికుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతి వెస్లీ, దివ్యాంగులు, వయోధికుల శాఖ సంచాలకులు శైలజ, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  మలక్‌పేటలోని జాతీయ దివ్యాంగుల ఉద్యానంలో ఏర్పాటుచేసిన హెలెన్‌ కెల్లర్‌ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని