TG High Court: ఒకే కారణంతో పలుమార్లు రిజిస్ట్రేషన్లు తిరస్కరించడం సరికాదు

న్యాయస్థానం ఒకసారి యథాతథ స్థితి లేదా స్టే ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో.. ఆ తర్వాత ఆ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినా, సవరించినా.. వాటిపై ఎలాంటి అప్పీళ్లు పెండింగ్‌లో లేనప్పుడు  రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 05 Jul 2024 03:55 IST

అప్పీళ్లేవీ పెండింగ్‌లో లేనప్పుడు ఇలా చేయడం కోర్టు ధిక్కరణే: హైకోర్టు 

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయస్థానం ఒకసారి యథాతథ స్థితి లేదా స్టే ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో.. ఆ తర్వాత ఆ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినా, సవరించినా.. వాటిపై ఎలాంటి అప్పీళ్లు పెండింగ్‌లో లేనప్పుడు  రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకే కారణంతో పలుమార్లు రిజిస్ట్రేషన్లను సబ్‌రిజిస్ట్రార్లు తిరస్కరించరాదని పేర్కొంది. అలాచేసే సబ్‌రిజిస్ట్రార్‌ల చర్య.. అధికరణ 300ఏ కింద రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనేనని పేర్కొంది. కోర్టు వివాదం పరిష్కారమైనా.. సంబంధిత ఉత్తర్వులు తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరీదేవి వేర్వేరుగా 23 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పెద్దఅంబర్‌పేటలోని సర్వే నం.265కి సంబంధించి ఇనాందారుల వారసత్వ వివాదంపై పిటిషన్లు దాఖలు కాగా.. యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు 2014లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అనంతరం 2017 ఆగస్టులో ఆ పిటిషన్‌లను కొట్టివేస్తూ.. వివాదంపై ఆర్డీవో తేల్చేదాకా యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 2024 మే నెలలో ఆర్డీవోతో పాటు ఇబ్రహీంపట్నం ఇనాం ట్రైబ్యునల్‌ కూడా ఆ పిటిషన్లను కొట్టివేసిందని.. దీంతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. అయినా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తున్నారని తెలిపారు. 

వాదనలను విన్న న్యాయమూర్తి.. కోర్టు ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌ అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా రిజిస్ట్రేషన్‌ను తిరస్కరిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ అంశాలపై నోట్‌ సిద్ధం చేసి.. సబ్‌రిజిస్ట్రార్‌లకు పంపాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీచేశారు. పిటిషనర్‌ రిజిస్ట్రేషన్లను తిరస్కరించడానికి ఉన్న కారణాలేమిటో ఈ నెల 5న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని