data centers: తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్‌బాబు

మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు.

Updated : 02 Jul 2024 07:44 IST

సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

మంత్రి శ్రీధర్‌బాబుతో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు 

ఈనాడు, హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. డేటా సెంటర్లకు సంబంధించిన భూసమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో సోమవారం మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మైక్రోసాఫ్ట్‌ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందన్‌వల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది. డేటా సెంటర్ల పనులు 70% పూర్తయ్యాయని, మేకగూడలోని భూమిపై స్థానిక గ్రామ పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంకను శ్రీధర్‌బాబు ఆదేశించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువల నిర్మాణాలను గడువులోగా ముగిస్తామని, పెండింగ్‌ పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం తరఫున ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించినందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మైక్రోసాఫ్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌ ఇయాన్‌ కాలన్, భూ అభివృద్ధి విభాగం హెడ్‌ ఉత్తమ్‌గుప్తా, ఇండియా కమ్యూనిటీ హెడ్‌ శ్రీచందన పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని