Ramoji Rao: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్‌ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్‌కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు.

Updated : 01 Jul 2024 07:36 IST

మాజీ ఎంపీ మురళీమోహన్‌
అరాచక పాలనను చీల్చి చెండాడారు: ఎమ్మెల్యే రఘురామ
జర్నలిజాన్ని సామాన్యుడి చెంతకు తెచ్చారు: ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌
బొటానికల్‌ గార్డెన్‌లో సంస్మరణ సభ

రామోజీరావు సంస్మరణ సభలో రవిశంకర్, రఘురామకృష్ణరాజు, మురళీమోహన్, డాక్టర్‌ సోమరాజు, 
డీఎన్‌ ప్రసాద్, పొదిలె అప్పారావు, వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్‌ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్‌కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. గచ్చిబౌలి బొటానికల్‌ గార్డెన్‌లో ఆదివారం వాకర్స్‌ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మురళీమోహన్‌ హాజరై ప్రసంగించారు. ‘సమాజానికి ఎంతో చేయాల్సి ఉందన్న సదుద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి వచ్చిన రామోజీరావు.. పత్రికలు, సినిమాలు, డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్‌సిటీ వంటి అనేకం చేపట్టి వేల మందికి ఉపాధి కల్పించారు. నాటి కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు చూసి.. మహానటుడు ఎన్టీఆర్‌ను రాజకీయ రంగంలోకి ఆహ్వానించారు. రామోజీరావు ఏ ముఖ్యమంత్రినీ.. ఏదీ కావాలని అడగలేదు. బ్యాంకులే దివాలా తీస్తున్న రోజుల్లో చిన్న లోపం కూడా లేకుండా మార్గదర్శిని నడిపిస్తుండడం గొప్ప విషయం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి, రౌడీయిజం పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును ఎండగడుతూ ఈనాడు-ఈటీవీలో వార్తాకథనాలు ఇచ్చారు’ అని అన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో సాగిన అరాచక పాలనను రామోజీరావు అక్షరాలతో చీల్చి చెండాడారు. మా కూటమి విజయంలో ఆయన పాత్ర కీలకం. తప్పు జరిగితే ఏ ప్రభుత్వాన్నైనా రామోజీరావు వ్యతిరేకించారు. ఆయన ఆదర్శాలు కొనసాగాలి’ అన్నారు. నిమ్స్‌ మాజీ డైరెక్టర్, ఏఐజీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగ నిపుణుడు డా.బి.సోమరాజు మాట్లాడుతూ.. ‘1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ధనవంతులకు రుసుంతో, పేదలకు ఉచిత వైద్య సేవలతో నిమ్స్‌ ప్రారంభించారు. వైద్యసేవలకు డబ్బులు వసూలు చేయడమేంటని ఇతర పత్రికలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. రామోజీరావు ఈ విధానాన్ని సమర్థించారు. ఆయన మద్దతు వల్లే ఈ సంస్థ నిలబడగలిగింది’ అని గుర్తు చేసుకున్నారు. 

‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. రామోజీరావు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, చట్టాన్ని గౌరవించడం వంటి లక్షణాలను పుణికి పుచ్చుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ‘ఆయన ప్రతి వ్యాపారం చట్టబద్ధంగా చేయాలనుకునేవారు. ప్రపంచంలో మార్పు అనేది శాశ్వతమని చెప్పేవారు. జర్నలిజం ఆకాశంలో విహరిస్తున్న సమయంలో దాన్ని సామాన్యుడి గుడిసె చెంతకు తీసుకొచ్చారు. ‘ఈనాడు’ జిల్లా పత్రికల్లో ప్రచురించే ‘మేమున్నాం.. మీకు తోడుగా’ శీర్షిక ద్వారా ప్రతినెలా సగటున 3 వేలు, ఏటా 36 వేల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దాని రూపకర్త మా ఛైర్మన్‌. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గంటన్నరసేపు మాతో మాట్లాడారు. అప్పుడూ ఆయన మానసిక పరిస్థితి ఎంతో దృఢంగా ఉంది. ఇకపై మనం ఇంకా బాధ్యతగా మెలగాల్సి ఉందని, ప్రజాపక్షమే ఈనాడు ధ్యేయమని మాకు హితబోధ చేశారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ మాజీ వీసీ పొదిలె అప్పారావు, ‘రాజధాని ఫైల్స్‌’ సినీ నిర్మాత కంఠంనేని రవిశంకర్, సంస్మరణ సభ సమన్వయకర్త క్రాంతి తదితరులు మాట్లాడుతూ రామోజీరావుతో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమ ప్రారంభంలో రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి, మౌనం పాటించారు. గచ్చిబౌలి ఇస్కాన్‌ గీతా లైఫ్‌ ప్రతినిధులు సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో వాకర్స్‌ డా.గడ్డిపాటి శ్యాంప్రసాద్, భరత్‌రెడ్డి, బాలకృష్ణ, వైడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు