TG News: ఈ ఏడాది పూర్తయ్యే నిర్మాణాలకే పెద్దపీట!

ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల  ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది.

Published : 05 Jul 2024 04:11 IST

ప్రాధాన్య పనుల వారీగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల  ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్‌ కూర్పు చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి డిస్ట్రిబ్యూటరీ వరకు నీటిని అందించే వ్యవస్థలను పటాల ఆధారంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సర్కిళ్ల నుంచి అందిన ప్రతిపాదనల్లో మూడు దఫాలు మార్పులుచేర్పులు చేసినట్లు తెలిసింది. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో కేటాయింపులను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నారు. మొత్తంగా గత బడ్జెట్‌లకు భిన్నంగా ఈ దఫా కేటాయింపులు ఉండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులు 14 ఉండగా వాటి కింద చివరి దశ పనులు పూర్తి చేయడం ద్వారా కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు అన్ని ప్రాజెక్టుల కింద పెండింగ్‌ బిల్లులు రూ.8,500 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. 

సర్కిళ్ల వారీగా ఇలా..

  • ఖమ్మం సర్కిల్‌ పరిధిలో.. శ్రీరాంసాగర్‌ చివరి ఆయకట్టులో ప్రస్తుతం 30 వేల ఎకరాలకు నీరు అందుతోంది. మరో 29 వేల ఎకరాలకు సాగునీరివ్వడానికి పనులు చేపట్టాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద భూసేకరణ, సొరంగాల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ పనులు చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది నీళ్లు ఇవ్వాలంటే ఈ ఏడాది పనులు జరగాలి. మున్నేరు నదికి రక్షణ గోడల నిర్మాణంతోపాటు సర్కిల్‌ పరిధిలో 135 మధ్యతరహా లిఫ్టులు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఈ ఏడాది రూ.1050 కోట్లు అవసరమన్న అంచనాలు ఉన్నాయి. అత్యవసరంగా కనీసం రూ.600 కోట్ల వరకు కేటాయింపుల ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. 
  • నాగర్‌కర్నూల్‌ సర్కిల్‌ పరిధిలో.. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల్లో భూసేకరణతోపాటు ప్యాకేజీ 29లో ప్రధాన కాలువ పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో రూ.440 కోట్ల వరకు ప్రతిపాదిస్తున్నారు. కనీసం రూ.220 కోట్ల మేర కేటాయింపుల ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.
  • ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు మహబూబ్‌నగర్, వనపర్తి సర్కిళ్ల నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశ పనులకు వనపర్తి సర్కిల్‌ నుంచి, మిగిలిన పనులకు మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ నుంచి ప్రతిపాదిస్తున్నారు. వనపర్తి నుంచి మొత్తం రూ.1250 కోట్లకు ప్రతిపాదించారు. దీనిలో దాదాపు రూ.వెయ్యి కోట్లు నారాయణపేట- కొడంగల్‌ లిఫ్టుకు సంబంధించిన కేటాయింపులు. మిగిలినవి రాజీవ్‌ నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, జూరాల కింద పెండింగ్‌ పనులు, భూసేకరణకు సంబంధించినవి. అయితే, ప్రస్తుతం పనులు చేపట్టే కాలాన్ని పరిగణలోకి తీసుకుని రూ.240 కోట్లకు చివరి ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం. 
  • ఆదిలాబాద్‌ సర్కిల్‌ పరిధిలో.. రూ.420 కోట్లకు పైగా ప్రతిపాదనలు ఉండగా.. చనాక- కొరటా తదితర ప్రాజెక్టుల కింద సత్వరమే సాగునీరు ఇచ్చేందుకు రూ.220 కోట్లకు తుది ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. 
  • నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలో.. కాళేశ్వరం ప్యాకేజీలు 20, 21లో పైపులతో సాగునీటిపారుదల, జలాశయాల విస్తరణ తదితర పనులు కలిపి తుది ప్రతిపాదనలు రూ.300 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. 
  • రామగుండం సర్కిల్‌ పరిధిలో.. కాళేశ్వరం, ఎల్లంపల్లి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రాధాన్య ప్రాజెక్టుల కింద తీసుకుంటున్నారు. అంచనాలు ఖరారు కాలేదు. 
  • రాష్ట్రంలో సాగునీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల నిర్వహణకు ఆ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా నిర్వహణ సమస్యలతో ఈ పథకాలు మూలకు చేరుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రతి లిఫ్టుకు ఒక ఆపరేటర్, వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొంటున్నారు. ప్రతి పది ఎత్తిపోతలకు డీఈ లేదా ఏఈ నేతృత్వంలో ఒక సాంకేతిక బృందం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికీ బడ్జెట్‌ కేటాయింపులు చేయనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని