PM Modi: దార్శనిక నేత వెంకయ్యనాయుడు

దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Updated : 01 Jul 2024 06:33 IST

ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
మాజీ ఉప రాష్ట్రపతిపై మూడు పుస్తకాల ఆవిష్కరణ 
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి: వెంకయ్య

‘వెంకయ్యనాయుడు.. ఏ లైఫ్‌ ఇన్‌ సర్వీస్‌’ పుస్తకాన్ని వర్చువల్‌గా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్యనాయుడని, ఆయన జీవితం తనతోపాటు లక్షల మంది కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. ఏబీవీపీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ‘భారతమాతకు జై’ అనే సంకల్పంతో భాజపా మహా వటవృక్షంగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు. జులై 1వ తేదీ వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ప్రధానమంత్రి దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు జీవితానికి సంబంధించిన మూడు పుస్తకాలు ‘వెంకయ్యనాయుడు.. ఏ లైఫ్‌ ఇన్‌ సర్వీస్‌’ (జీవన ప్రస్థానం), ‘సెలబ్రేటింగ్‌ భారత్‌’ (13వ ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల ప్రయాణం), ‘మహానేత’ (జీవన చిత్ర మాలిక)లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు దంపతులు, తెలంగాణ, మిజోరం గవర్నర్లు సీపీ రాధాకృష్ణన్, కంభంపాటి హరిబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, తెలంగాణ, ఏపీ హైకోర్టుల న్యాయమూర్తులు జస్టిస్‌ రామకృష్ణప్రసాద్, జస్టిస్‌ హరినాథ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సత్యకుమార్, జీఎంఆర్‌ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు, మాజీ ఎంపీలు మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్‌రావు, సి.రామచంద్రయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘వెంకయ్య జీవితానికి సంబంధించిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి. దేశసేవలో సరైన మార్గాన్ని నిర్దేశిస్తాయి. సుదీర్ఘకాలం వెంకయ్యనాయుడితో కలసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో భాజపా ఇంత మంచి స్థాయిలో ఉందంటే వెంకయ్యనాయుడు లాంటివారే కారణం. 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఆయన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి, 17 నెలలు జైల్లో ఉన్నారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో వెంకయ్య ఏ శాఖ కోరుకున్నా దక్కేది. కానీ పేదలు, రైతులు, గ్రామీణ ప్రాంతాలకు సేవచేయాలనే సంకల్పంతో గ్రామీణాభివృద్ధిశాఖ కావాలని ఎంచుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. 2014లో మా మంత్రివర్గంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా.. స్మార్ట్‌సిటీ మిషన్, అమృత్‌ మిషన్‌ వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికారు. ఆయన వాక్చాతుర్యం, చతురత అద్భుతం. వెంకయ్యనాయుడి మాటల్లో గంభీరత, దార్శనికత ఉంటాయి. మేం ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అక్కడ మాకు మెజారిటీ లేకపోయినా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బిల్లు నెగ్గేలా చేయగలగడం వెంకయ్యనాయుడికే సాధ్యమైంది. మకర సంక్రాంతి లేదా తెలుగు పండుగల సందర్భంగా దిల్లీలో ఆయన ఇచ్చే ఆతిథ్యం కోసం అంతా ఎదురుచూసేవాళ్లం. 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుంది. వెంకయ్యనాయుడు కూడా తమ జీవన శతాబ్ది వేడుకలు జరుపుకోవాలి’ అంటూ ప్రధాని ఆకాంక్షించారు.


కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు

భారతీయ భాషలకు ప్రాధాన్యమివ్వాలి: వెంకయ్యనాయుడు

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ అద్భుతంగా సేవలు అందిస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో రెండో అత్యున్నత పదవి నుంచి విరమణ చేసిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలను తొలగించి.. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. అవసరమైనంత కాలం ఉచిత బియ్యంతో పేదలకు ప్రభుత్వం అండగా నిలవొచ్చని.. కానీ ఉచితాలను అలవాటు చేయడం సరికాదన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహించడం మంచి పరిణామమన్నారు. పార్లమెంట్, విద్యావ్యవస్థలు, న్యాయస్థానాల్లో కూడా వ్యవహారాలన్నీ భారతీయ భాషల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. మొదట మాతృభాష, తర్వాత సోదరభాష, తర్వాతే ఏ ఇతర భాష అయినా అని అన్నారు. రాజకీయ పార్టీలంటే గౌరవం తగ్గిపోతోందని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. పార్టీ మారినప్పుడు అనివార్యంగా రాజీనామా చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టంలో లొసుగులున్నాయని, పదో షెడ్యూలును సవరించాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని