Pavuluri Krishna Chaudhary: విజ్ఞాన గని.. డా.పావులూరి కృష్ణ చౌదరి

డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు.

Updated : 30 Jun 2024 06:47 IST

‘ఈనాడు’ ఎండీ కిరణ్‌
వృత్తిలో ఆయనది అసాధారణ నైపుణ్యం: శైలజా కిరణ్‌
డా.కృష్ణ చౌదరి మనవరాలు రచించిన పుస్తకావిష్కరణ 

‘డా.పావులూరి కృష్ణ చౌదరి డిటర్మైండ్‌ టు విన్‌’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌. చిత్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ విశ్రాంత కమిషనర్‌ జాస్తి కృష్ణకిశోర్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, డా.అపర్ణా కొడాలి, మైనేని శ్రీనివాసరావు

రాయదుర్గం, న్యూస్‌టుడే: డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు. కృష్ణ చౌదరి మనవరాలు డా.అపర్ణా కొడాలి రచించిన ‘డా.పావులూరి కృష్ణ చౌదరి డిటర్మైండ్‌ టు విన్‌’ అనే పుస్తకాన్ని హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో శనివారం రాత్రి కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ఆవిష్కరించారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ.. డా.కృష్ణ చౌదరికి రాజకీయాలపై ఎంతో పరిజ్ఞానం ఉండేదన్నారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ నుంచి ఆధునిక భారత రాజకీయాల వరకు పలు అంశాలపై విశ్లేషణలు చేసేవారని తెలిపారు. ఆయనకు తాను విద్యార్థినని... చిన్న, చిన్న అనారోగ్య సమస్యల లక్షణాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన నుంచి తెలుసుకునేవాడినని చెప్పారు. రోగ లక్షణాలను గుర్తించడంలో కృష్ణ చౌదరిలాగే ఆయన మనవరాలు డా.అపర్ణకు మంచి నైపుణ్యం ఉందన్నారు. తన తాతపై పుస్తకం తీసుకురావడంలో ఆమె ఎంతో శ్రమించారన్నారు. శైలజా కిరణ్‌ మాట్లాడుతూ.. తన మామయ్య(రామోజీరావు) హోమియోపతి వైద్యంపై విశ్వాసం చూపించేవారన్నారు. కుటుంబంలో ఎవరికి బాగా లేకపోయినా కృష్ణచౌదరి వద్దకు వెళ్లేవారమని, ఆయనా తమ వద్దకు వచ్చి వైద్యసేవలు అందించేవారని తెలిపారు. తమ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. కృష్ణచౌదరి.. వివేకం, పరిజ్ఞానం, వృత్తిలో నైపుణ్యం ఉన్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. తన పని చూసి.. ఇలాగే ముందుకు సాగాలని ప్రోత్సహించేవారన్నారు. డా.కృష్ణ చౌదరితో కలిసి 25 ఏళ్లపాటు ఉదయపు నడక సాగించిన మైనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జీవిత చరమాంకం వరకూ వైద్య సేవలందిస్తానని ఆయన చెప్పేవారన్నారు. పట్టుదల గల వ్యక్తి అని, విజ్ఞాన గని అని కొనియాడారు. హోమియోపతిపై ఆయన రాసిన మూడు పుస్తకాలను రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రచురించారన్నారు. ఆంగ్లంలో రాసిన మరో పుస్తకాన్ని ప్రచురించాలని అపర్ణా కొడాలిని కోరారు. ఇన్‌కం ట్యాక్స్‌ విశ్రాంత కమిషనర్‌ జాస్తి కృష్ణకిశోర్‌ మాట్లాడుతూ.. డా.కృష్ణ చౌదరి ఇంటర్‌లో ఎంపీసీ చదివాక ఎంబీబీఎస్‌ చేశారన్నారు. ఓ రోగికి అల్లోపతి వైద్యంతో అనారోగ్య సమస్య తగ్గకపోవడంతో స్నేహితుడి ద్వారా హోమియోపతి వైద్యం గురించి తెలుసుకుని.. లండన్‌కు వెళ్లి ఆ వైద్య విధానంలో కోర్సు పూర్తి చేశారని వివరించారు. ఆయన వద్ద రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు వైద్యం చేయించుకునే వారన్నారు. రాష్ట్రంలో హోమియోపతి వైద్యవిద్య ప్రారంభించేలా చూశారని తెలిపారు. హోమియోపతి వైద్య ప్రాధాన్యాన్ని గుర్తించిన రామోజీరావు ఆదివారం ప్రత్యేక అనుబంధంలో డా.కృష్ణ చౌదరి వైద్యానికి చోటు కల్పించి ప్రోత్సహించారని చెప్పారు. రామోజీరావు, కృష్ణ చౌదరిలు తమ తమ రంగాల్లో దిగ్గజాలని కొనియాడారు. డా.అపర్ణ మాట్లాడుతూ.. కృష్ణ చౌదరి ఉత్సాహవంతుడు, కర్మయోగి అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని