మరోసారి కూలిన ఓడేడ్‌ వంతెన గడ్డర్లు

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది.

Updated : 03 Jul 2024 07:03 IST

మూణ్నెల్ల కిందట మూడు.. ఇప్పుడు ఐదు 

ఈనాడు- పెద్దపల్లి, టేకుమట్ల, ముత్తారం-న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్‌అండ్‌బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016లో రూ.47 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని