New Criminal Laws: సరళమా.. సంక్లిష్టమా..?

దేశంలో జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభనష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌),

Published : 30 Jun 2024 05:49 IST

కొత్త న్యాయ చట్టాలకు రంగం సిద్ధం
రేపటి నుంచే అమలులోకి..
సిబ్బందికి శిక్షణ, సాంకేతిక మార్పులు పూర్తి
వెసులుబాట్లు.. కొన్ని సందేహాలూ.. 

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో జులై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలతో లాభనష్టాలపై చర్చ జరుగుతోంది. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) రాబోతున్న విషయం  తెలిసిందే. వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు కొత్త చట్టాల అమలుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణ శిబిరాలు   నిర్వహించారు. కంప్యూటర్‌ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వీటివల్ల కొన్ని విషయాల్లో పోలీసుల అధికారాలు మరింత పెరుగుతాయని, దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

యంత్రాంగానికి మార్గదర్శకాలు..

  • నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు ఉద్దేశించిన గడువును పెంచారు. ప్రస్తుతం అరెస్టయిన 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ గడువును.. 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు, 90 రోజుల్లోపు దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు పొడిగించారు.
  • ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో దర్యాప్తు అధికారులు తప్పనిసరిగా ఫోరెన్సిక్‌ నిపుణులతో ఆధారాల్ని సేకరింపజేయాలి.
  • 3-7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి.
  • ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. 
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయాలి. వారు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
  • పోక్సో కేసుల్లో బాధితురాళ్ల వాంగ్మూలాలను పోలీసులే కాకుండా.. మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయొచ్చు.
  • క్రిమినల్‌ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.

వీటితో సరళతరం..

  • కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ప్రతి సమాచారం ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా బాధితులకు అందుతుంది. 
  • సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్రపరుస్తారు. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌) ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేసినందున... సాక్ష్యాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపుతారు. డిజి లాకర్‌ను ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసీజేఎస్‌)కు అనుసంధానం చేస్తారు. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు.. అవసరమైనప్పుడు సాక్ష్యాలను పరిశీలించుకోవచ్చు. దీనివల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. 
  • ఇళ్ల సోదాల ప్రక్రియను పోలీసులు తప్పనిసరిగా వీడియో తీయించాలి. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు.. సంబంధిత నివేదికను 48 గంటల్లోనే న్యాయస్థానంలో సమర్పించాలి. దీనివల్ల వాటిని తారుమారు చేసే అవకాశం తగ్గుతుంది. 
  • బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదుపై పోలీసులు మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. 
  • మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు. 
  • దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఇకపై డిజిటల్‌ రూపంలో అంటే వాట్సప్‌ తదితర మార్గాల్లో పంపవచ్చు. దీనివల్ల అటు బాధ్యులు, ఇటు పోలీసులు సాకులు చెప్పి తప్పించుకోలేరు. 
  • సాక్షి మరో ఊరిలోని కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్లాల్సిన పనిలేదు. ఉన్న ఊర్లోనే గెజిటెడ్‌ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వచ్చు. 
  • బాధితుల అరెస్టు సమాచారాన్ని వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు తెలపాలన్న నిబంధన విధించారు. దీనివల్ల బాధితులకు తక్షణసాయం లభించే వీలుంది. అరెస్టు వివరాలను పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. 
  • బాధితులకు, నిందితులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఉచితంగా అందిస్తారు. పోలీస్‌ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండు వారాల్లో పొందొచ్చు.

వీటితో సందిగ్ధత..

  • ఏవైనా నేరాలు కొత్త చట్టం అమలులోకి రావడానికి ముందు... అంటే 2024 జూన్‌ 30కి ముందు మొదలై, అమలులోకి వచ్చిన తర్వాత అంటే 2024 జులై 1 తర్వాత కూడా కొనసాగుతుంటే, బహుళ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై చివరి కేసు నమోదైన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలి. 2024 జూన్‌ 30లోపు నేరం జరిగి, జులై 1 తర్వాత అది బయటపడితే.. నేరం జరిగిన సమయమే ప్రామాణికం. అంటే పాత చట్టం ప్రకారమే కేసు నమోదు చేయాలి. దర్యాప్తు అధికారులు, న్యాయవాదులు, న్యాయస్థానాలను గందరగోళానికి గురిచేసే విషయమిది. పాత చట్టాల కింద నమోదైన కొన్ని కేసులు నెలల తరబడి దర్యాప్తు, కొన్నేళ్లపాటు విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో దర్యాప్తు అధికారులు పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి. రెండు రకాల కేసులు కలిపి దర్యాప్తు, న్యాయవిచారణ జరిపేటప్పుడు సంక్లిష్టత ఎదురయ్యే అవకాశం ఉంది.
  • పోలీసు కంప్యూటర్‌ వ్యవస్థలో జులై 1 నుంచి కొత్త చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసినందున.. పాత కేసుల దర్యాప్తులో సమస్యలు తప్పకపోవచ్చని సిబ్బంది చెబుతున్నారు.
  • చాలా రాష్ట్రాల్లో సీసీటీఎన్‌ఎస్, ఐసీజేఎస్‌ పూర్తికాలేదు. ఇటువంటి చోట పరిస్థితి ఏమిటన్నది స్పష్టత లేదు. దర్యాప్తు అధికారులు తమకు కావాల్సినప్పుడు పాత పత్రాలు, సాక్ష్యాల వంటివి డిజి లాకర్‌ ద్వారా ఎలా చూసుకోవాలన్న అంశంలోనూ స్పష్టత లేదు.
  • చిన్నచిన్న నేరాలకు సామాజిక సేవలు చేయించడం వంటి శిక్షలు విధించవచ్చు. కానీ, ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధించాలన్న దానిపై స్పష్టత లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని