TG News: పురపాలికల్లో పొరుగు సేవల సిబ్బందికి మళ్లీ విధులు!

రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధుల నుంచి తొలగించిన పొరుగు సేవల (అవుట్‌ సోర్సింగ్‌) సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది.

Published : 05 Jul 2024 03:51 IST

ఆస్తి పన్ను మినహా ఇతర విభాగాల్లో వినియోగానికి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధుల నుంచి తొలగించిన పొరుగు సేవల (అవుట్‌ సోర్సింగ్‌) సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. ఈ సిబ్బందిలో కొందరు వసూలు చేసిన ఆస్తి పన్నులో చేతివాటాన్ని ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది. పొరుగు సేవల సిబ్బందికి ఆస్తి పన్ను వసూలు బాధ్యత అప్పగించడంపై ఆడిట్‌ విభాగం సైతం అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో వారిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి నుంచి వారికి ఎలాంటి విధులూ అప్పగించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిబ్బంది సుమారు 2-3 వేల మంది వరకు ఉన్నారు. 

సిబ్బంది కొరత నేపథ్యంలో..

కొన్ని పురపాలికల్లో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉంది. దీనిపై ఆయా పురపాలికల నుంచి ఉన్నతాధికారులకు లేఖలు వస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లోని పురపాలికల్లో పొరుగు సేవల సిబ్బంది పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. సిబ్బంది కొరతకు తోడు వీరూ అందుబాటులో లేకపోవటంతో వివిధ సేవలకు విఘాతం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రత్యక్షంగా ఆర్థిక అంశాలతో సంబంధాలు లేని విభాగాల్లో ఈ పొరుగు సేవల సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. త్వరలో దీనిపై పురపాలికలకు అధికారిక వర్తమానం పంపనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని