MP Lads: ఎంపీ లాడ్స్‌ ఆన్‌లైన్‌లో!

పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్‌) వ్యయం ఇకపై ఆన్‌లైన్‌ వేదికగా జరగనుంది.

Updated : 01 Jul 2024 08:48 IST

పోర్టల్‌ ద్వారానే గుత్తేదారుల ఖాతాలకు నిధులు
నెల రోజుల్లో అందుబాటులోకి  వచ్చే అవకాశం
ఈనాడు, పెద్దపల్లి

పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్‌) వ్యయం ఇకపై ఆన్‌లైన్‌ వేదికగా జరగనుంది. ఇప్పటివరకు ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిర్వహణకు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయానికి నివేదికలు పంపించేవారు. వారు ఆమోదిస్తేనే పనులు ప్రారంభమయ్యేవి. ఆపై బిల్లులను సీపీవో మంజూరు చేస్తే సంబంధిత శాఖలకు, అక్కడి నుంచి గుత్తేదారులకు చెల్లించేవారు. ఈ క్రమంలో ఆదాయ, వ్యయాల నిర్వహణ మొత్తం పేపర్లపై జరిగేది. ఇకపై ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరగనుంది. గుత్తేదారుకు దిల్లీ నుంచి ‘ఈ-సాక్షి’ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగనున్నాయి. మరో నెల రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కొత్త విధానం అమలు కోసం పాత ఖాతాలన్నింటినీ స్తంభింపజేసి అందులోని నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. 

సులభం.. వేగం..

నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి లోక్‌సభ సభ్యుడికి ‘మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీం (ఎంపీ లాడ్స్‌)’ కింద ఏటా రూ.5 కోట్లను విడతల వారీగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించేందుకు కేంద్రం ఆరు నెలల కిందట ప్రయోగాత్మకంగా ‘ఈ-సాక్షి’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ విధానంలో ఎంపీ స్వయంగా  పోర్టల్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఎంపీకి ప్రత్యేక పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. నిధులు, విధి విధానాల వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. పనుల వివరాలను ఆన్‌లైన్‌లోనే పొందుపరిచి సీపీవో కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి పని మంజూరు చేస్తూ నోడల్‌ ఏజెన్సీ (సంబంధిత ప్రభుత్వ శాఖ)కి పంపిస్తారు. పని చేపట్టాక గుత్తేదారుల వివరాలను ఏజెన్సీయే ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తుంది. అనంతరం ఎంపీ లాడ్స్‌ వివరాలు పర్యవేక్షించే దిల్లీలోని కేంద్ర గణాంక కార్యాలయం నుంచి నేరుగా గుత్తేదారు ఖాతాలో నిధులు జమవుతాయి. ఈ విధానంతో ఎంపీ పరిధిలోని వివిధ జిల్లాల నుంచి పనుల ప్రతిపాదనలను సీపీవో కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయాస తప్పింది.


పోర్టల్‌పై ఎంపీలకు అవగాహన

ఈ-సాక్షి పోర్టల్‌ను గతంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ప్రస్తుతం కొత్త లోక్‌సభ కొలువు తీరడంతో ఇకపై దీని ద్వారానే ఎంపీ లాడ్స్‌ పనులు, నిధులు కేటాయిస్తారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కేంద్ర గణాంక శాఖ మరోసారి సమావేశం నిర్వహించి పోర్టల్‌ పనితీరుపై అవగాహన కల్పించనుంది.

గంప రవీందర్, పెద్దపల్లి జిల్లా సీపీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని