TG News: రైతు భరోసా విధివిధానాలకు మంత్రివర్గ ఉపసంఘం

రైతుభరోసా పథకంపై అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Jul 2024 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌:  రైతుభరోసా పథకంపై అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా వ్యవసాయ, రెవెన్యూ, పరిశ్రమల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు నియమితులయ్యారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అధ్యయనం అనంతరం ఉపసంఘం రైతు భరోసా విధివిధానాలను, మార్గదర్శకాలతో కూడిన సిఫార్సులను సమర్పించాలని సూచించింది.

ఎన్ని ఎకరాలకివ్వాలి?

రైతు భరోసా పథకం అమలు విధివిధానాల రూపకల్పనలో భాగంగా ఎన్ని ఎకరాల వారికి దానిని అమలు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇప్పటికే 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆదర్శ రైతుల మనోభావాలను తెలుసుకున్న ప్రభుత్వం.. అందులో స్పష్టత రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది సూచనలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి సహకార సంఘం పరిధిలో రైతులను సమీకరించి వారితో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ సంకల్పాన్ని తెలిపి, వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలో 5 ఎకరాల లోపు, 8 ఎకరాల లోపు, పదెకరాల లోపు, 15, 20, 30 ఎకరాల లోపు... ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ సమాచారాన్ని వ్యవసాయాధికారులు సేకరించారు. మరో రెండు రోజుల పాటు ఇది జరగనుంది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని