NEET: నీట్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

‘నీట్‌’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు.

Published : 21 Jun 2024 04:56 IST

మంత్రి డి.శ్రీధర్‌బాబు డిమాండ్‌
గ్రూప్‌-2, 3లలో పోస్టుల పెంపుపై క్యాబినెట్‌లో చర్చిస్తామని వెల్లడి

కొరియన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో రాయబారి చాంగ్‌ జే బొక్, శేఖర్‌రెడ్డి తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: ‘నీట్‌’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు. ఎమ్మెల్యేలు విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాజ్‌ ఠాకూర్‌లతో కలిసి ఆయన గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడారు. ‘‘నీట్‌ నిర్వహణ, ఫలితాల అంశంలో లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. జూన్‌ 14న ఫలితాలు రావాల్సి ఉన్నా.. జూన్‌ 4న అదీ ఎన్నికల ఫలితాల రోజే విడుదల చేయడం, గ్రేస్‌ మార్కులు కలపడం, 67 మందికి తొలి ర్యాంకు రావడంపై అనుమానాలకు తావిస్తోంది. శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణికి అందించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి. ఈ గనుల వేలంలో పాల్గొనాలా... వద్దా... అనే దానిపై సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. మా ఆలోచన వారికి చెప్పాం. రాష్ట్ర సమస్యలు, కేంద్ర సహకారం, సింగరేణి తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో ప్రధాని మోదీని కలుస్తారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోం. అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని భారాస నేతలు మాకు సూచించడం విడ్డూరం. పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటే కాళేశ్వరంలా అవుతుంది. జీఓ 46పై ఆందోళన వద్దు. అందరికీ న్యాయం చేస్తాం. గ్రూప్‌-1 మెయిన్స్‌పై నోటిఫికేషన్‌లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకెళతాం. లేదంటే మళ్లీ న్యాయ సమస్యలు వచ్చే ప్రమాదముంది. గ్రూప్‌-2, 3ల పోస్టుల పెంపు డిమాండ్‌పై... క్యాబినెట్‌లో చర్చిస్తాం. అందరి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం రేవంత్‌రెడ్డి జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తారు’’ అని శ్రీధర్‌బాబు వివరించారు. 


కొత్త పారిశ్రామిక విధానంపై కసరత్తు 

మాదాపూర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్లపై పాలసీలు తీసుకొస్తామన్నారు. గురువారం మాదాపూర్‌లో నిర్వహించిన ‘‘కొరియా-ఇండియా ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ ఫోరం 2024’’ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ‘‘పెట్టుబడులకు తెలంగాణను తొలి గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. అనేక కొరియన్‌ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. యంగ్‌వన్‌ కార్పొరేషన్‌ వరంగల్‌లోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్రీడాదుస్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. తద్వారా 12 వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొరియన్‌ అంకుర సంస్థలకు అవకాశాలు కల్పించేందుకు దక్షిణకొరియాతో టీ-హబ్‌ ఒప్పందం చేసుకుంది. కొరియన్‌ పెట్టుబడిదారుల కోసం ఇన్వెస్ట్‌ తెలంగాణ సెల్‌’ పేరిట ప్రత్యేక డెస్క్‌ ప్రారంభించనున్నాం. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో అవసరమైతే కొరియన్‌ కంపెనీల సహకారం తీసుకుంటాం’’ అని వివరించారు. సమావేశంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా రాయబారి చాంగ్‌ జే బొక్, కొరియా కాన్సుల్‌ జనరల్‌ సురేష్‌ చుక్కపల్లి, రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని