Seethakka: ఐఏఎస్, ఐపీఎస్‌లను ఆదర్శంగా తీసుకోండి

మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క అన్నారు.

Published : 27 Jun 2024 03:18 IST

యువతకు మంత్రి సీతక్క పిలుపు
ఉగ్రవాదం కన్నా డ్రగ్స్‌ తీవ్ర ప్రమాదకరం: మంత్రి జూపల్లి

మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక పాట సీడీని ఆవిష్కరిస్తున్న మంత్రులు సీతక్క,  జూపల్లి కృష్ణారావు. చిత్రంలో  శైలజ, భాస్కర్, సుమన్, మిథాలీరాజ్, తేజ సజ్జా, రవిగుప్తా, జితేందర్, సందీప్‌ శాండిల్య

రాయదుర్గం, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చించి రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళావేదికలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీ న్యాబ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆదర్శంగా తీసుకుని అలా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదం కన్నా ఈ డ్రగ్స్‌ వ్యసనం తీవ్ర ప్రమాదకరం. తెలియకుండానే యువతను బానిసలుగా మార్చి వారి జీవితాలను నాశనం చేస్తుంది. మాదక ద్రవ్యాల నివారణకు పీడీ చట్టాలు నమోదు చేయడమేకాక విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, టీన్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి, దివ్యాంగుల సాధికారత శాఖ డైరెక్టర్‌ శైలజ, సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి, జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్, డీసీపీ భాస్కర్, సినీ నటులు సుమన్, తేజా సజ్జా, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

లఘుచిత్రం ఆవిష్కరణ

సినీ నటుడు చిరంజీవి సూచనలతో.. మాదక ద్రవ్యాల వల్ల ఎదురయ్యే అనర్థాలపై నిర్మించిన, సినిమా థియేటర్‌లలో ప్రదర్శించే లఘుచిత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు.    

డ్రగ్స్‌పై అవగాహన కల్పించే పాట సీడీని, గోడ పత్రికలను ఆవిష్కరించారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో డ్రగ్స్‌ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని