Land Market Value: మార్కెట్‌ విలువల పెంపు 20-40 శాతం!

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ పెంపు దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 26 Jun 2024 07:07 IST

రిజిస్ట్రేషన్‌ శాఖకు చేరిన నివేదికలు 
కొత్త ఐజీ రాకతో మంగళవారం నాటి సమీక్ష వాయిదా 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ పెంపు దాదాపు 20 నుంచి 40 శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్‌మెంట్లకు సంబంధించి ప్రాంతాల వారీగా ఈ నెల 18వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విలువల సవరణపై ప్రాథమిక అంచనాలను శాఖ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. 2021 నాటి సవరణ అనంతరం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్‌ విలువలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన సవరణ ప్రతిపాదనలు మొదటి దశలో సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు, వారి పరిశీలన అనంతరం డీఐజీ (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌) కార్యాలయాలకు వచ్చాయి. వాటిపై తుది పరిశీలనలు పూర్తిచేసిన డీఐజీలు మంగళవారం కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా వాయిదా పడింది. 

కొత్త ఐజీ రాకతో...

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా(అదనపు బాధ్యతలు) జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ప్రభుత్వం తాజాగా నియమించింది. ఈ పోస్టులో ఉన్న నవీన్‌మిత్తల్‌ నుంచి ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికానందున భూముల మార్కెట్‌ విలువల సవరణకు సంబంధించి మంగళవారం కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నిర్వహించాల్సిన సమీక్ష వాయిదా పడింది. బుధ లేదా గురువారాల్లో ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికార వర్గాల సమాచారం. 

అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అధికంగా..

రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ఉదాహరణకు హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ఐదారేళ్ల నుంచి బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. నగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువకు, బహిరంగ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో పెంపు కనీసం 40 శాతం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే చ.గజం విలువ ఇప్పుడు అమల్లో ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం రూ.లక్ష ఉంటే కొత్త విలువ రూ.ఒక లక్షా నలభై వేలకు చేరవచ్చు. మండల, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువల పెంపు 20 శాతం వరకు ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల విలువలు భారీగా సవరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎకరా కనీస ధర రూ.75 వేలుగా ఉండగా, మారుమూల గిరిజన ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ రూ.2.50 లక్షలుగా నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం స్థానిక ధరల ఆధారంగా పెంపు ఉండొచ్చని తెలిసింది. 


వాయిదాకూ అవకాశం 

మార్కెట్‌ విలువల సవరణ నిర్ణయాన్ని ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశం ఉందనే చర్చ రిజిస్ట్రేషన్‌ శాఖ వర్గాల్లో నడుస్తోంది. త్వరలో రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటం, పొరుగు రాష్ట్రం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో అక్కడ స్థిరాస్తి రంగంలో మార్పులను పరిగణనలోకి తీసుకున్న అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తంచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని