Universites: వసతుల్లేని వర్సిటీలు!

ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది.

Published : 01 Jul 2024 05:20 IST

అధ్వానంగా హాస్టళ్లు..
పెచ్చులూడుతున్న పైకప్పులు.. తలుపుల్లేని మరుగుదొడ్లు
నాసిరకంగా భోజనం.. ఆందోళనలు చేస్తున్నా చర్యలు శూన్యం
నిధులు పెద్దగా అవసరం లేని పనులూ చేయని అధికారులు
బడ్జెట్‌లో కేటాయింపులే అరకొర.. వాటిలోనూ ఇచ్చేది నామమాత్రమే
ఈనాడు-హైదరాబాద్, ఈనాడు యంత్రాంగం

ఓయూ ఈ-1 హాస్టల్‌లో పైకప్పు సీలింగ్‌ ఇలా..

ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. పీజీ పట్టాలు పొందే సంగతేమో గాని..సురక్షితంగా బయటపడితే చాలన్నట్లుగా కొన్ని వర్సిటీల్లోని హాస్టళ్లలో పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏ ఫ్యాన్‌ ఊడి నెత్తి పగలగొడుతుందో.. పైకప్పు పెచ్చు పైనపడుతుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌ మీద పడి ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడటం ఇందుకు ఉదాహరణ. కొత్త విద్యాసంవత్సరం(2024-25) ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వర్సిటీలు, హాస్టళ్లలో కనీస వసతుల తీరుపై ప్రత్యేక కథనం..

విద్యార్థులు అడిగేవి.. చిన్న చిన్న పనులే

విద్యార్థులు అడిగేవి గొంతెమ్మ కోరికలు కావు. మురుగునీటి ప్రవాహం.. తిరగని ఫ్యాన్లు.. తలుపుల్లేని మరుగుదొడ్లు.. నాసిరకం భోజనం.. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అందుకు రూ.కోట్ల నిధులు అక్కర్లేదు. రూ.లక్షలు వెచ్చిస్తే చాలు. అయినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. మరోవైపు, బడ్జెట్‌ లేకున్నా వీసీలు, రిజిస్ట్రార్లు, డైరెక్టర్లు తమ కార్యాలయాలను, బంగ్లాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారని.. వీసీలు, రిజిస్ట్రార్లుగా కొత్తవారు రాగానే వారి గదులు, క్వార్టర్లకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్త కార్లూ కొంటున్నారన్న విమర్శలున్నాయి.

తెలంగాణ వర్సిటీలోని పాత బాలుర హాస్టల్‌లో అద్దాలు పగిలిపోవడంతో కిటికీకి కట్టిన పరదా

 నిధుల కేటాయింపుతో సరి..

విశ్వవిద్యాలయాల్లో వివిధ అభివృద్ధి పనులకు బడ్జెట్‌లో కొన్నిసార్లు నిధులు కేటాయించినా.. కాగితాలకే పరిమితమవుతున్నాయి. వేతనాల చెల్లింపులకు ఇచ్చే బ్లాక్‌ గ్రాంట్‌తో పాటు అభివృద్ధి పనుల నిమిత్తం ఎనిమిది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో రూ.420 కోట్లు, 2018-19లో రూ.210 కోట్లు కేటాయించింది. వాటిలో సగం కూడా విడుదల చేయలేదు. పాలమూరు వర్సిటీకి 2017-18లో రూ.40 కోట్లలో రూ.12 కోట్లే విడుదలయ్యాయి. 2018-19లో రూ.20 కోట్లకు గాను ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఓయూకు 2017-18లో రూ.200 కోట్లు కేటాయించినా.. రూ.50 కోట్లే అందాయి. 2018-19లో రూ.60 కోట్లు ప్రకటించగా.. ఒక్క రూపాయీ ఇవ్వలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు అసలు నిధులే మంజూరు చేయలేదు. గత బడ్జెట్‌(2023-24)లో అభివృద్ధి పనులకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. వేతనాల కోసం ఇచ్చే బ్లాక్‌ గ్రాంట్‌ పూర్తిస్థాయిలో రావాలంటే విద్య, ఆర్థిక శాఖల చుట్టూ తిరగాల్సిందే. అంబేడ్కర్‌ వర్సిటీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.18.97 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.14.98 కోట్లు మాత్రమే అందాయి. బాసర ఆర్జీయూకేటీకి 2019-20 నుంచి 2023-24 వరకు రూ.176 కోట్లు కేటాయించగా.. రూ.133.04 కోట్లు మాత్రమే అందాయి. ఒకట్రెండు తప్ప మిగిలిన వర్సిటీల పరిస్థితి ఇదే. మహిళా విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తామన్న ప్రకటన ప్రహసనంగా మారింది. 2022-23లో ఒక్క పైసా ఇవ్వలేదు. 2023-24లోనూ అదే మాట చెప్పారు. ఇచ్చింది శూన్యమే.

కాకతీయ.. ఊడుతున్న పెచ్చులు

కాకతీయ విశ్వవిద్యాలయంలోని పద్మాక్షి హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టళ్ల చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, పొదలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని భయాందోళనలకు గురవుతున్నారు. భోజనం నాణ్యంగా ఉండటం లేదని ధర్నాలు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. పోతన హాస్టల్‌ భవనం దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించినది కావడంతో గదుల్లో పెచ్చులు ఊడిపడుతున్నాయి. గ్రంథాలయం.. వంద మంది వస్తే చాలు కిక్కిరిసిపోతోంది. విద్యార్థులే సొంతంగా కుర్చీలు తెచ్చుకోవాల్సి వస్తోంది.

ఓయూ.. అరకొరగా మూత్రశాలలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. గతంలో సీ హాస్టల్‌లో ఫ్యాన్‌ ఊడి.. ఓ విద్యార్థిపై పడింది. లా కళాశాల విద్యార్థులుండే ఈ-1 హాస్టల్‌లో పైకప్పు పెచ్చులు ఎప్పుడు మీద పడతాయో అన్న పరిస్థితి ఉంది. ఈ-1, డీ హాస్టల్, ఎన్‌ఆర్‌ఎస్‌లో మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపోయినన్ని లేవు. వసతిగృహాల్లోకి పాములు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం భోజనంపై విద్యార్థులు తరచూ ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

తెలంగాణ వర్సిటీ.. హాస్టల్‌ కిటికీలకు పరదాలే గతి

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పాత బాలుర వసతిగృహంలోని గదుల్లో చాలాచోట్ల పెచ్చులూడాయి. పలు గదులకు, కిటికీలకు తలుపులు లేవు. విద్యార్థులు కిటికీలకు పరదాలు కట్టుకోవాల్సిన దుస్థితి. నూతన బాలుర వసతిగృహంలోని గదుల్లో గోడలు పగుళ్లు తేలాయి. విద్యార్థినులకు ఒకే వసతిగృహం ఉంది. దీంతో గదుల్లో సామర్థ్యానికి మించి ఉంటున్నారు. కొన్ని కిటికీలకు తలుపులు లేకపోవడంతో తరచూ విషపు పురుగులు లోనికి వస్తున్నాయి.

 జేఎన్‌టీయూహెచ్‌.. ట్యాప్‌లు లేవ్‌

జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల.. వసతిగృహాలు.. వర్సిటీ ఆవరణలో అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. మూత్రశాలల్లో ట్యాప్‌లు లేని సింక్‌లు, పైపులు ఊడిపోయిన పలకలు దర్శనమిస్తున్నాయి. అపరిశుభ్రత, దుర్వాసన కారణంగా విద్యార్థులు వినియోగించలేని పరిస్థితి ఉంది. చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకునే చోటా అపరిశుభ్రత తాండవిస్తోంది. వర్సిటీ ఆవరణలో వరదనీటి కాలువలపై మూతలు ధ్వంసమయ్యాయి. చిన్న, చిన్న మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రూ.30 వేలు అందుబాటులో ఉంటాయి. ఆ నిధులు ఖర్చయిపోతే మళ్లీ అంతే నిధులను వినియోగించుకోవచ్చు. రూ.లక్షల్లో అవసరమైనప్పుడు ఈసీ అనుమతి తీసుకొని పనులు చేపట్టే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఈ దిశగా అధికారులు చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 


పాలమూరు.. మరుగుదొడ్లకు తలుపుల్లేవు

పాలమూరు వర్సిటీలోని ఫార్మసీ కళాశాల వసతిగృహాల్లో విద్యుత్తు తీగలు బయటకు వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయి. ట్యూబ్‌లైట్లు వేలాడుతున్నాయి. భోజనశాలలో కుర్చీలు, బెంచీలు సరిపడా లేవు. మహిళా వసతిగృహాల్లో నలుగురికి మాత్రమే సరిపోయే గదిలో 8 నుంచి 12 మంది వరకు ఉండాల్సి వస్తోంది. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పూర్తిగా అందుబాటులో లేవు. మరుగుదొడ్లకు తలుపుల్లేవు. ఐదేళ్లుగా నిధులు రాక చిన్న, చిన్న పనులను పెండింగ్‌లో పెడుతున్నారు. మైనర్, మేజర్‌ మరమ్మతులు, ఇతర పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెండింగ్‌లో ఉండిపోయిందని ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.


తెలుగు విశ్వవిద్యాలయం.. ఊడిపోతున్న స్లాబ్‌ పెచ్చులు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో ఆడిటోరియం సమీపంలో స్లాబ్‌ పెచ్చులు ఊడిపోతున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవు. బాచుపల్లిలో వంద ఎకరాల్లో కొత్త క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చింది. పాత భవనంలో కొన్ని కోర్సులు నడుస్తున్నాయి. రెండు ప్రాంగణాలకు కలిపి కనీసం రూ.20 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాంపల్లి ప్రాంగణంలోని సమస్యల్ని పరిష్కరించడానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు అవసరం. వర్సిటీకి ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు ఉండవని, గ్రాంట్‌లో నుంచే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చెబుతున్నారు.


బాసర ఆర్జీయూకేటీ.. ఉపవాస దీక్షలు చేసినా

బాసర ఆర్జీయూకేటీలో 2022 జూన్‌లో విద్యార్థులు ఆందోళనలు, ఉపవాస దీక్షలు చేసినా నాసిరకం భోజనం, అధ్యాపకుల కొరత లాంటి సమస్యలూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. మూడేళ్ల క్రితం హాస్టల్‌లోని పీఓపీ పెచ్చులు ఊడి పీయూసీ(ఇంటర్‌) మొదటి సంవత్సరం విద్యార్థికి గాయాలయ్యాయి. కొత్త గదుల్లోనూ సరైన సౌకర్యాలు లేవు. వసతులు లేని గదులకు తాళం వేశారు. గతంలో అనుమతి లేకుండానే రూ.లక్షలు వెచ్చించి భోజనశాలకు నాసిరకంగా మరమ్మతులు చేశారు. విద్యార్థులందరికీ ఇప్పటికీ దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు అందించలేదు. గతంలో ఆర్జీయూకేటీకి వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని