power bill: మీ కరెంటు బిల్లు ఎంతో తెలుసుకోండి ఇలా..

వినియోగించిన కరెంటుతో పోలిస్తే జారీచేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కం డిజిటల్‌ కాలిక్యులేటర్‌లో సరిచూసుకునే అవకాశం కల్పించినట్లు దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి తెలిపారు.

Updated : 27 Jun 2024 08:58 IST

డిస్కం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి డిజిటల్‌ కాలిక్యులేటర్‌
వెల్లడించిన సీఎండీ

డిస్కం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎనర్జీ కాలిక్యులేటర్‌

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగించిన కరెంటుతో పోలిస్తే జారీచేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కం డిజిటల్‌ కాలిక్యులేటర్‌లో సరిచూసుకునే అవకాశం కల్పించినట్లు దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ప్రతినెలా 30 లేదా 31 రోజులకు మీటర్‌ రీడింగ్‌ నమోదుచేసి బిల్లు జారీచేయాలి. కొన్ని సందర్భాల్లో రెండు లేదా మూడు రోజుల ఆలస్యంగా నమోదు చేస్తున్న కారణంగా ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరగడంతో..టారిఫ్‌ మారి అధికంగా బిల్లులు వస్తున్నాయనే అపోహ కొందరు వినియోగదారుల్లో ఉంది. వాస్తవానికి దాదాపు 99.5 శాతం బిల్లులు నెల రోజులకే ఇస్తున్నాం. రీడింగ్‌ తీసిన రోజుల సంఖ్యతో సంబంధం లేకుండా కచ్చితంగా నెల రోజులకే వచ్చేలా స్పాట్‌ బిల్లింగ్‌ మెషిన్‌లో సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచాం. అయినా కొందరి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు తమ విద్యుత్‌ బిల్లుల  సమాచారం తెలుసుకునేందుకు వీలుగా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌లో ‘ఎనర్జీ ఛార్జెస్‌ కాలిక్యులేటర్‌ ఫర్‌ డొమెస్టిక్‌ సర్వీసెస్‌’ పేరుతో ఏర్పాటుచేశాం. బిల్లులో నమోదైన రీడింగ్‌ తీసిన తాలూకు తేదీలు, యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదుచేస్తే బిల్లింగ్‌ రోజులు, ఎంత ఛార్జీ వేశారనే వివరాలు తెలుస్తాయి’ అని సీఎండీ వెల్లడించారు. త్వరలో దీన్ని సంస్థ మొబైల్‌ యాప్‌లోనూ పొందుపరుస్తామని తెలిపారు. రాష్ట్రంలోని రెండు పంపిణీ సంస్థల ఛార్జీలు ఒకటే అయినందున ఉత్తర డిస్కం వినియోగదారులకూ ఈ సదుపాయం ఉపయోగపడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని