Junior doctors: ప్రతి నెలా స్టై‘పెండింగ్‌’

అత్యంత ప్రధానమైన వైద్య వృత్తిలో ఉన్న యువ డాక్టర్లు... ప్రజారోగ్యాన్ని కాపాడే క్రతువులో కీలక భూమిక పోషిస్తారు... ఇలాంటి వారికి ఎలాంటి సౌకర్యమైనా క్షణాల్లో సమకూర్చాలి కదా!

Published : 19 Jun 2024 03:25 IST

అధికారుల చుట్టూ తిరగాలి
సమస్యలు చెబుతూ కాళ్లావేళ్లా పడాలి
ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీసు ఇవ్వాలి
ఏళ్లుగా జూనియర్‌ డాక్టర్ల పరిస్థితి ఇదే

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత ప్రధానమైన వైద్య వృత్తిలో ఉన్న యువ డాక్టర్లు... ప్రజారోగ్యాన్ని కాపాడే క్రతువులో కీలక భూమిక పోషిస్తారు... ఇలాంటి వారికి ఎలాంటి సౌకర్యమైనా క్షణాల్లో సమకూర్చాలి కదా! కానీ, నెలనెలా స్టైపెండ్‌ కూడా సరిగా ఇవ్వడంలేదు. జూనియర్‌ డాక్టర్ల(జూడా) ప్రతినిధులు ప్రతి రెండు, మూడు నెలలకోసారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ... అందరి కాళ్లావేళ్లా పడాల్సి వస్తోంది. ఏళ్లుగా ఇదే ప్రహసనం. వారు తమ ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీసు ఇస్తే తప్ప స్టైపెండ్‌ విడుదల చేసే పరిస్థితి లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని హౌస్‌ సర్జన్లుగా పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు, పీజీ విద్యార్థులకు ప్రతినెలా చెల్లించే స్టైపెండ్‌కు ఒక కచ్చితమైన తేదీ లేకపోవడం గమనార్హం. ఒక్కోసారి రెండు, మూడు నెలలకు కూడా రావడంలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో 1,700 మంది హౌస్‌సర్జన్లు, 3,500 మంది పీజీ విద్యార్థులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా చెల్లించాల్సిన స్టైపెండ్‌ మొత్తం రూ.38 కోట్లు ఉంటుంది. హౌస్‌సర్జన్లకు నెలకు రూ.25,906, పీజీ విద్యార్థుల్లో మొదటి సంవత్సరం వారికి రూ.58,289, ద్వితీయ సంవత్సరం వారికి రూ.61,528, మూడోసంవత్సరం విద్యార్థులకు రూ.64767 చెల్లిస్తారు. ఈ మేరకు వారికి ప్రతినెలా సరిగా అందకపోవడంతో... దీనిపైనే ఆధారపడిన జూనియర్‌ డాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సమస్యకు శాశ్వతపరిష్కారం చూపాలని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం ఉండటంలేదు. 

ఆర్థిక శాఖ వద్ద ఆగుతున్న నిధుల విడుదల

సాధారణంగా ప్రతినెలా జూడాల హాజరు వివరాలను మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లు డీఎంఈ కార్యాలయానికి పంపుతారు. అక్కడి నుంచి స్టైపెండ్‌ చెల్లింపు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు వెళ్తాయి. చెల్లింపుల టోకెన్లు జారీ అవుతున్నా... ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కావు. దీంతో ప్రతినెలా జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు డీఎంఈ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ అధికారులను కలసి నిధుల విడుదలకు విన్నవించుకుంటున్నారు. అయినా ఫలితం ఉండటంలేదు. చివరికి... విసిగి వేసారి రెండు, మూడు నెలలకోసారి వారు విధుల బహిష్కరణకు సమ్మె నోటీసు ఇస్తే... చివరి క్షణం వరకు ప్రభుత్వం స్పందించడంలేదు. 


శాశ్వత పరిష్కారం చూపండి
- జి.సాయి శ్రీహర్ష, అధ్యక్షుడు జూడాల అసోసియేషన్‌ 

స్టైపెండ్‌ కోసం ప్రతినెలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం చాలా ఇబ్బదికరంగా ఉంది. నెలకు ఐదారు రోజులపాటు అధికారులను కలవడానికి వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చిన్న మొత్తమే. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముంది. ఏడాదికి అవసరమైన బడ్జెట్‌కు ముందుగానే ఆమోదం తెలపడం లేదంటే గ్రీన్‌ఛానెల్‌ ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పిస్తేనే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ప్రోత్సాహక వేతనం నెలనెలా రాకపోవడంతో మాకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని