Job Calendar: ఏటా ఉద్యోగాల భర్తీ!

రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది.

Updated : 02 Jul 2024 06:50 IST

రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్‌
స్పష్టంగా నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు 
షెడ్యూలు ప్రకారమే గ్రూప్‌-2 నిర్వహణ
ప్రభుత్వం అడుగులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  

ముసాయిదా నోటిఫికేషన్‌ సిద్ధం

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాధిపతులు, నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుదిరూపు తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ‘‘రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్‌ ఉండాలి’’ అని సీఎం ఆదేశించినట్లు సమాచారం. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్లి ఛైర్మన్‌తో మాట్లాడి, విధానాల్ని తెలుసుకున్న విషయం తెలిసిందే. ముసాయిదా క్యాలెండర్‌లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీకి ఉత్తర్వులు జారీకానున్నాయి. రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించింది. ఇందులో.. ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి. న్యాయవివాదాలు తలెత్తకుండా సర్వీసు నిబంధనల ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.  మరోవైపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అలానే గ్రూప్‌-2 పరీక్షను షెడ్యూలు ప్రకారం ఆగస్టులో పూర్తిచేసేందుకు సర్కారు సమాయత్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు