Hyderabad-vijayawada Road: సెప్టెంబరులో హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించేలా కసరత్తు చేయాలని, సెప్టెంబరులో పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు.

Updated : 29 Jun 2024 07:07 IST

ప్రాంతీయ రింగు రోడ్డుతో పారిశ్రామిక కారిడార్లు
సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించేలా కసరత్తు చేయాలని, సెప్టెంబరులో పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులపై హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఇప్పటికే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చొరవ తీసుకుని రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగించింది. దాంతో త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టాలని నిర్ణయించాం. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)తో రాష్ట్రంలో పారిశ్రామిక వికాసం తారస్థాయికి చేరుతుంది. దాన్ని సాధ్యమైనంత వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ఆర్‌ఆర్‌ఆర్‌ అందుబాటులోకి వస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లు, ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి. జులై మొదటి వారంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈలోగా జాతీయ రహదారులకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలి. 

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరకొర నిధులు 

భారాస ప్రభుత్వ నిర్లక్ష్యంతో జాతీయ రహదారుల నిర్మాణానికి తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. ప్రభుత్వ పరంగా ఇకపై ఎలాంటి అలసత్వం ఉండొద్దు. మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం సబబుకాదు. హరిత ట్రైబ్యునల్‌ తీర్పు మేరకు 930 చెట్లను రీ-లొకేట్‌ చేసేందుకు అవసరమైన అనుమతులను యుద్ధ ప్రాతిపదికన తీసుకురావాలి. ఆర్మూర్‌-మంచిర్యాల జాతీయ రహదారి భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి. ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ పనుల నుంచి ప్రస్తుత గుత్తేదారును తొలగించి, కొత్త గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఎల్బీనగర్‌-మల్కాపూర్‌ మార్గంలో మన్నెగూడ వద్ద ప్రమాదాలు జరుగుతుండటంతో వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి కుష్వా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని