RRR: వీడుతున్న చిక్కుముడులు

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి.

Updated : 29 Jun 2024 07:37 IST

ఏకకాలంలో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణం
కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత
త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా
భూ సేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడమే ఉత్తమమని కేంద్రం చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈమేరకు దిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతోపాటు ఆయా అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 350.79 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు వేయనున్న 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం నాలుగేళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ఇచ్చింది. దీన్ని నిర్మించేందుకు 4,750 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలక దశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది. జులైలో భూముల యజమానులకు తుది నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారానికీ కసరత్తు చేస్తున్నారు. 

దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌కు సూత్రప్రాయ ఆమోదం

చౌటుప్పల్, ఆమన్‌గల్, షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున దక్షిణ భాగాన్ని నిర్మిస్తారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నంబరును త్వరలో కేటాయించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అధికారులు ఆయా ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భాగం ఎలైన్‌మెంటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆ ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. 

ఆ రెండింటిపై స్పష్టత 

  • రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ రకాల తీగలు, స్తంభాలు, పైప్‌లైన్ల(యుటిలిటీస్‌) తరలింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం తెరదించింది. ఇందుకు రూ.300 కోట్లకుపైగా వ్యయం అవుతుందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని అప్పటి భారాస ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఏఐ లేఖ రాయడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై పీటముడి పడింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఖర్చులను చెల్లిస్తామని ఒప్పుకొంది. అయితే, గత ఒప్పందం ప్రకారం... యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని నితిన్‌గడ్కరీ స్పష్టం చేయటంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 
  • భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని నిర్ణయించిన నేపథ్యంలో గతంలో అంగీకరించిన మేరకు రూ.100 కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ విధానాన్ని కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. నష్టపరిహారం కింద రైతులకు చెల్లించేందుకు ఆ మొత్తాన్ని వినియోగించిన వెంటనే మరో రూ.100 కోట్లను ఆ నిధికి జమ చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇప్పటికే రూ.100 కోట్లు జమ చేసింది. ఇలా చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోతుండటంతో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని