TG High Court: కమిషన్‌ చట్టబద్ధమే

విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

Published : 02 Jul 2024 06:16 IST

ఈఆర్‌సీ కంటే దాని పరిధి విస్తృతం
జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ విచారణను నిలిపివేయేం
పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు
మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు
నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదనా ఆమోదయోగ్యం కాదు
మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ప్రజాప్రాముఖ్యం ఉన్న సున్నితమైన అంశాలను సాధారణ దర్యాప్తు సంస్థలకు అప్పగించిన పక్షంలో సందేహాలకు తావిచ్చే అవకాశం ఉందని.. విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిషన్‌తో విచారణ జరిపించవచ్చని రాంకృష్ణ దాల్మియా వర్సెస్‌ ఎస్‌.ఆర్‌.టెండోల్కర్, కర్ణాటక వర్సెస్‌ కేంద్రం కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.


మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగ విధులు నిర్వహించారన్న విషయాన్ని విస్మరించలేం. కేవలం విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటన ఇచ్చారన్న కారణం తప్ప వేరే ఇతర సమాచారం లేదు. పక్షపాతం అంటూ ఊహించి చెప్పరాదు.. దాన్ని నిరూపించాలి. నిరూపించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారు. 

తీర్పులో హైకోర్టు ధర్మాసనం


ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. విస్తృత ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్నిచ్చే వ్యక్తులతో కూడిన ఉన్నతస్థాయి కమిషన్‌తో విచారణ జరిపించవచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని పేర్కొంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై న్యాయపరమైన వ్యవస్థలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు(ఈఆర్‌సీ) తేల్చిన అంశాలపై విచారించే పరిధి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు లేదన్న మాజీ సీఎం కేసీఆర్‌ వాదన ఆమోదయోగ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈఆర్‌సీల కంటే జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ పరిధి విస్తృతమని పేర్కొంది. ఈఆర్‌సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి ఈ కమిషన్‌కు లేదన్న వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారించే పరిధి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు ఉందని తేల్చిచెప్పింది. జస్టిస్‌ నరసింహారెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఊహించి చెప్పరాదని.. దానికి తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఇక్కడ కేవలం మీడియా ప్రకటన తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిరూపించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది. విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటు నిర్ణయాల్లో కేసీఆర్‌ పాత్ర ఉందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని ఆయనకు కమిషన్‌ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొందని.. అందువల్ల నోటీసులు చట్టవిరుద్ధమన్న వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారణను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మార్చి 14న ఇచ్చిన జీవో 9ని సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పులోని ముఖ్యాంశాలు..

ఇది వాస్తవ నిర్ధారణ కమిషన్‌

‘‘విచారణ కమిషన్‌ల చట్టం-1952 కింద కొన్ని అధికారాలతో ప్రభుత్వాలు కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ చట్టం కింద వాస్తవ నిర్ధారణ కమిషన్‌ మాత్రమే ఏర్పాటవుతుంది. తమ ముందున్న ఆధారాల ద్వారా వాస్తవాలను సేకరించి నివేదిక సమర్పించడమే కమిషన్‌ బాధ్యత. అంతేగానీ బాధ్యులుగా నిర్ణయిస్తూ తీర్పు వెలువరించడంగానీ, నివేదికను అమలు చేసే అధికారంగానీ కమిషన్‌కు లేవు. 

ఈఆర్‌సీల నిర్ణయంపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్, ఆపైన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని కచ్చితత్వాన్ని, ఔచిత్యాన్ని ఈఆర్‌సీ నిర్ణయించిందా? లేదా అన్న అంశాన్ని తేల్చాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య 2015 సెప్టెంబరు 22న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం(పీపీఏ) జరిగింది. ప్రాజెక్టు ఖర్చు, టారిఫ్‌ నిర్ణయాలపై మాత్రమే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీలు విచారించాయి. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ విధివిధానాలను పరిశీలిస్తే.. ఈఆర్‌సీలు తేల్చిన అంశాల కంటే విస్తృతమైనవి ఉన్నాయి. ఈ వ్యవహారాలపై నిర్ణయాల్లోని లోపాలు, అవి చూపే ఆర్థిక ప్రభావంపై కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అందువల్ల తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌కు లేదన్న వాదన ఆమోదయోగ్యం కాదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారించే పరిధి కమిషన్‌కు ఉంది.

పక్షపాతం ఆరోపణ ఊహాజనితం కారాదు

పక్షపాతంతో వ్యవహరించారన్న ఊహకు చట్టబద్ధతలేదు. దాన్ని నిరూపించాలి.. అంతేగానీ ఊహాజనితం కారాదు. ఏప్రిల్‌ 14న కమిషన్‌ నోటీసు జారీ చేయగా జూన్‌ చివరి వరకు ఎన్నికల హడావుడి ఉన్నందున గడువు కావాలని కేసీఆర్‌ మే 1న లేఖ రాశారు. దీనిపై కమిషన్‌ స్పందిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉందని, మే 13న ఎన్నికలు పూర్తవుతున్నందున మే 31.. లేదంటే జూన్‌ 15లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు మే 4న సమాచారం అందజేసింది. అనంతరం జూన్‌ 11న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి విచారణ స్థాయిని వివరించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు.  అంతమాత్రాన కమిషన్‌ పక్షపాతంతో ఉందన్న ఆరోపణలపై విచారణను నిలిపివేయలేం. కేసీఆర్‌కు మార్చి 14న జారీ చేసిన నోటీసులు చట్ట విరుద్ధమన్న వాదనా ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా సెక్షన్‌ 8బి కింద జారీ చేసిన నోటీసులు కూడా చట్టఉల్లంఘన కాదు’’ అని ధర్మాసనం తెలిపింది. అందువల్ల కేసీఆర్‌ పిటిషన్‌పై విచారించడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంటూ.. దాన్ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని