Health profile: ప్రజలందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌!

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్‌ ప్రొఫైల్‌) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.

Updated : 04 Jul 2024 06:44 IST

ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమాచారం నిక్షిప్తం
వ్యక్తిగతంగా ప్రత్యేక సంఖ్య కేటాయించే అవకాశం

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్‌ ప్రొఫైల్‌) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతోపాటు సత్వర, సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి, ఆరోగ్యకార్డులను అందిస్తారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య ఖాతా(ఆభా) గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. బోధనాసుపత్రులకు చికిత్సల కోసం వచ్చేవారి వివరాలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నప్పుడు ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ సంఖ్యతోపాటు ఆభా సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేయాలంది. ఈ నేపథ్యంలో రోగుల హెల్త్‌ ప్రొఫైల్‌ అవసరం ఉంటుందని వైద్యారోగ్య శాఖ పేర్కొంటోంది.

గోప్యతకు ప్రాధాన్యమిచ్చేలా మార్గదర్శకాలు

హెల్త్‌ ప్రొఫైల్‌ ఆధారంగా రోగి ఆరోగ్య సమస్యలను కచ్చితంగా గుర్తించి, రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇస్తారు. రోగి అనారోగ్యం, అప్పటి వరకు పొందిన వైద్యం, వాడుతున్న మందులు, ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధులు, వైద్యుల అభిప్రాయం సహా అన్ని అంశాలు డిజిటల్‌ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా వివరాలన్నీ వైద్యులకు అందుబాటులో ఉండటంతో మెరుగైన వైద్యం అందించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగుల గోప్యతను పాటిస్తూనే అవసరమైన వారికి మాత్రమే ఆయా వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి ప్రొఫైల్‌ను రూపొందించాలా... ఇంటింటికీ వెళ్లి ప్రజల పూర్తి ఆరోగ్య వివరాలను సేకరించాలా...? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని, అందుకే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తోందన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని