TGPSC: పోస్టుల భర్తీలో పెరిగిన వేగం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల తుది ఫలితాలను వెల్లడించింది.

Published : 27 Jun 2024 05:56 IST

తుది నియామక దశలో నోటిఫికేషన్లు
ఇప్పటికే పూర్తయిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ
తుది కీతో పాటు ఫలితాల వెల్లడికి కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల తుది ఫలితాలను వెల్లడించింది. మరికొన్నింటి ఫలితాలను ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్‌-4 మినహా ఇప్పటికే రాతపరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు సంబంధించి రెండు నెలల్లోగా ఫలితాలు వెల్లడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌-1 పోస్టులకు ఈనెల 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ దాదాపు పూర్తయింది. త్వరలోనే తుది కీ విడుదల చేసి, ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్‌ సమాయత్తమైంది. షెడ్యూలు ప్రకారం అక్టోబరులో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కనీసం మూడు నెలల గడువు ఉండేలా ప్రిలిమినరీ ఫలితాలను వెల్లడించాలని, ఆ మేరకు ప్రధాన పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయం లభిస్తుందని భావిస్తోంది. గురుకుల నియామక బోర్డు పరిధిలో సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన టీచర్లు, లెక్చరర్లు వచ్చేనెల మొదటివారం నుంచి విధుల్లో చేరనున్నారు. 

ముగింపు దశకు ఏఈఈ పోస్టుల భర్తీ..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2022 నుంచి ఇప్పటివరకు 18 వేలకు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్‌-1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాతపరీక్షలు రద్దయ్యాయి. అనంతరం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్త ప్రభుత్వం టీజీపీఎస్సీ బోర్డును పునర్నియమించి నియామకాల్లో వేగం పెంచింది. బోర్డు.. రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు జాబితాలను వెల్లడించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. కొత్తగా గ్రూప్‌-1 ప్రకటన జారీ చేయడంతో పాటు ప్రిలిమినరీ పరీక్ష పూర్తిచేసి, కీ విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో 1,540 ఏఈఈ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల ఎంపిక జాబితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే సివిల్‌ పోస్టులవి రానున్నాయి. 833 సహాయ ఇంజినీర్‌ పోస్టుల ఫలితాల వెల్లడికి బోర్డు సమాయత్తమవుతోంది.

కొనసాగుతున్న గ్రూప్‌-4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన

గ్రూప్‌-2 పోస్టులకు టీజీపీఎస్సీ ఆగస్టులో రాతపరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేసింది. దరఖాస్తుల్లో వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్‌ సదుపాయం కల్పించింది. అలాగే 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈనెల 29తో ముగియనున్నాయి. డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల పోస్టుల కోసం రాతపరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్‌ ర్యాంకులు ప్రకటించిన కమిషన్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలు పెట్టింది. ఈ పరిశీలన ఆగస్టులో ముగియనుంది. ఆ తరువాత తుది ఫలితాల ప్రక్రియ చేపట్టనుంది. భూగర్భజలశాఖలో గెజిటెడ్‌ అధికారుల పోస్టుల ఫలితాలను ఇప్పటికే ప్రకటించింది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఆప్షన్లు తీసుకుంటోంది. ఈ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి జులై 2వరకు జరుగుతుంది. పురపాలకశాఖలో ఎకౌంట్స్‌ అధికారుల పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి ఎంపిక జాబితాలను ప్రకటించింది. ఇంటర్‌ విద్యా విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది నియామక ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని