సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం: తుమ్మల

తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల సంఖ్యను పెంచుతామన్నారు.

Published : 05 Jul 2024 03:37 IST

మహదేవ్‌పూర్‌ ప్రాథమిక సహకార సంఘానికి పురస్కారం అందజేస్తున్న మంత్రి తుమ్మల, చిత్రంలో టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు, ఎన్‌సీడీసీ ఆర్డీ వంశీకృష్ణ తదితరులు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల సంఖ్యను పెంచుతామన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో గురువారం ఉత్తమ సహకార సంఘాలకు పురస్కారాలను అందజేశారు. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు(టెస్కాబ్‌)లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... ‘‘పీఏసీఎస్‌ల ద్వారా రుణాలతోపాటు సాధారణ, ఆరోగ్య బీమాలను, దిగుబడుల శుద్ధి, నిల్వ సదుపాయాలను కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 60,759 సంఘాలుండగా వాటిలో 908 కీలకమైనవి. వ్యవసాయ రుణాల్లో 20%, ఎరువుల పంపిణీలో 60% వాటా సహకార సంఘాలదే. పాల ఉత్పత్తిలో, చేపల వ్యాపారంలోనూ వీటి పాత్రే అధికం. ఈ రంగంలో యువత, మహిళల భాగస్వామ్యం పెరగాలి. మున్ముందు విత్తనాల, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సర్టిఫికేషన్‌ కోసం  ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వాటి మార్కెటింగ్, ఎగుమతుల కోసం సహకార సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతాం’’ అని వివరించారు. 

సంఘాలకు ఎన్‌సీడీసీ పురస్కారాలు

పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, అప్పన్నపేట, జగిత్యాల జిల్లా రాయికల్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని పీఏసీఎస్‌లకు, మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల మత్స్యకార సహకార సంఘానికి... ప్రతిభ, ఉత్తమ పురస్కారాలను, రూ.25 వేల చొప్పున నగదు బహుమతులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు, ఇన్‌ఛార్జి ఎండీ గోపి, సహకార సంచాలకుడు ఉదయ్‌కుమార్, ఎన్‌సీడీసీ ప్రాంతీయ సంచాలకుడు డి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్కాబ్‌ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

మరో మార్కెట్‌ కమిటీకి పాలకవర్గం

వరంగల్‌ జిల్లా నర్సంపేట మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కమిటీ నియామకం జరిగిన పదో మార్కెట్‌ యార్డు ఇది. మరో 100 యార్డులకు నియామకాలు జరగాల్సి ఉంది. 

వ్యవసాయ డైరెక్టరేట్‌లో మంత్రి తనిఖీ

హైదరాబాద్‌ నడిబొడ్డున ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ సంచాలకుడి కార్యాలయాన్ని గురువారం ఉదయం 10.49 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపల అధికారులు, సిబ్బంది కనిపించకపోవడంతో విస్మయం చెందారు. మంత్రి 10.55 గంటల వరకు వేచిచూడగా మరో ఇద్దరు మాత్రమే వచ్చారు. వ్యవసాయ సంచాలకుడు గోపికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా, టెస్కాబ్‌ ఇన్‌ఛార్జి ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించడంతో ఆయన డైరెక్టరేట్‌కు ఎక్కువగా రావడం లేదు. దాంతో మిగిలిన అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వచ్చిపోతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. అక్కడి నుంచి టెస్కాబ్‌కు వెళ్లిన మంత్రికి... డైరెక్టర్‌ గోపి విషయాన్ని వివరించేందుకు యత్నించారు. డైరెక్టరేట్‌లోనే సమయపాలన పాటించకపోవడంపై తుమ్మల మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని