మొత్తం పోస్టులా? పనిచేస్తున్న వారి సంఖ్యా?

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

Published : 05 Jul 2024 03:22 IST

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు ప్రాతిపదిక ఏది?!
నేడు ప్రత్యేక ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసే ప్రత్యేక ఉత్తర్వులతో పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. శుక్రవారం ఈ ప్రత్యేక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల ఐదో తేదీ నాటికి నాలుగేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియను వైద్యవిద్య డైరెక్టరేట్‌(డీఎంఈ), రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌(వీవీపీ), రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో 40 శాతం ఉద్యోగుల బదిలీలకు అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఎంత శాతం మంది బదిలీలకు ఉత్తర్వులు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాడర్‌ స్ట్రెంగ్త్‌లో 40 శాతం బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. అత్యవసర సేవలు అందించే వైద్య ఆరోగ్యశాఖలో క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ (మొత్తం పోస్టులు)ను పరిగణనలోకి తీసుకుంటారా? లేదంటే వర్కింగ్‌ స్ట్రెంగ్త్‌ (విధుల్లో ఉన్నవారు)ను పరిగణనలోకి తీసుకుంటారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. 

కీలక విభాగాల్లో భారీగా ఖాళీలు

వైద్య, ఆరోగ్యశాఖలో కీలక విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. ప్రధానంగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 40% బదిలీలకు క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ని పరిగణనలోకి తీసుకుంటే బదిలీల అనంతరం కొన్నిచోట్ల ఎక్కువ ఖాళీలు మిగలడం లేదా అందరూ బదిలీపై వెళ్లే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దృష్టికి కొందరు వైద్యులు, ప్రొఫెసర్లు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యధికంగా మెడికల్‌ పీజీ విద్యార్థులు ఉంటున్న నేపథ్యంలో వారికి బోధన, శిక్షణపై ప్రభావం పడేందుకు అవకాశం లేనివిధంగా బదిలీలు ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

2018లోనూ పాక్షిక మార్పులు..

2018లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బదిలీ మార్గదర్శకాల్లోనూ వైద్య, ఆరోగ్యశాఖ పాక్షికంగా మార్పులు చేసింది. వైద్యులు, నర్సుల క్యాడర్‌లో బదిలీలను 20 శాతానికి పరిమితం చేసింది. స్పెషలిస్ట్‌లను బదిలీ చేసినపుడు ఆ స్థానంలో అదే విభాగానికి చెందిన స్పెషలిస్ట్‌లను నియమించాలి తప్ప వేరే విభాగానికి చెందిన స్పెషలిస్ట్‌లతో భర్తీ చేయకూడదని స్పష్టం చేసింది. తాజాగా చేపట్టే బదిలీల్లో హైదరాబాద్‌ను ఒకే యూనిట్‌గా పరిగణిస్తారా? లేదా అందులో మార్పులు ఉంటాయా? అన్న అంశంపై మార్గదర్శకాల్లోనే స్పష్టత వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని