‘సీఎస్‌ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా..’

రాష్ట్రంలో కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్‌టీయూహెచ్‌ గురువారం లేఖ రాసింది.

Published : 05 Jul 2024 03:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్‌టీయూహెచ్‌ గురువారం లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి ఉపకులపతి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్‌రావు ఈ లేఖ రాశారు. వాస్తవానికి అనుమతుల విధివిధానాలపై ఏఐసీటీఈ గత జనవరిలోనే హ్యాండ్‌బుక్‌ విడుదల చేసింది. అపరిమిత సీట్లు మంజూరు చేస్తామని అందులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోగా ఇటీవల అనుమతులిచ్చింది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జేఎన్‌టీయూహెచ్‌ లేఖ రాయడంపై ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో దాదాపు 88 వేల సీట్లకు విశ్వవిద్యాలయం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఇతర బ్రాంచీల్లోని సుమారు 7 వేల సీట్లను కుదించుకొని సీఎస్‌ఈ తదితర డిమాండ్‌ ఉన్న బ్రాంచీల్లో పెంచుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని