సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 465 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉదయశ్రీ,

Updated : 05 Jul 2024 04:03 IST

డిగ్రీ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 465 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉదయశ్రీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డిలు గురువారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనకు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో పరిష్కరిస్తామని కమిషనర్‌ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.


పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా అర్హుల జాబితాను శుక్రవారంలోగా పంపాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, అదనపు డీఆర్‌డీఓలు, జిల్లా, డివిజినల్‌ పంచాయతీ అధికారుల జాబితాలు పంపాలని కలెక్టర్లకు సూచించారు. మండల పంచాయతీ అధికారులు, ఏఓలు, పంచాయతీ కార్యదర్శులు, డీపీఓ కార్యాలయాల్లోని సీనియర్‌ అసిస్టెంట్లు ప్రతిపాదనలు పంపించాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. మండల పరిషత్‌ అధికారుల జాబితాలను, జడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్ల జాబితాలు రూపొందించి పంపాలని జడ్పీ సీఈఓలకు సూచించారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎంపీడీఓలు, ఇతర అధికారుల బదిలీలు పెద్దఎత్తున జరిగాయి. వారిని మినహాయించి మిగిలిన వారికి తాజాగా బదిలీలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ భావిస్తోంది.


జడ్పీల ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు 

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో నం.44) జారీ చేసింది. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్‌పర్సన్‌లు, జడ్పీటీసీ సభ్యులు, కోఆప్షన్‌ సభ్యుల పదవీకాలం గురువారంతో ముగిసింది. ఆయా జిల్లా పరిషత్‌లలో శుక్రవారం నుంచి కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు చేపడతారు. వారు ఆర్నెల్ల పాటు ప్రత్యేకాధికారులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగిలిన నాలుగు జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 6న ముగుస్తుంది. అక్కడ 7 నుంచి ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపడతారు.


తొలిరోజే 56,674 మంది స్లాట్‌ బుకింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు తొలిరోజే గురువారం సాయంత్రం 5 గంటల వరకు 56,674 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈనెల 12 వరకు బుకింగ్‌కు అవకాశం ఉందని, 8వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలవుతాయని ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.


నీట్‌ లీకేజీపై కేంద్రం మౌనం వీడాలి

విద్యార్థి, యువజన సంఘాల ఊరేగింపు 

నారాయణగూడ, న్యూస్‌టుడే: నీట్‌ పత్రాల లీకేజీ, నెట్, సీఎస్‌ఐఆర్, నీట్‌ పీజీ పరీక్షల రద్దు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్‌ చేస్తూ.. నిర్వహించిన భారత విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైందని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రకటించారు. గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాచిగూడ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్‌ కూడలి వరకు ఊరేగింపు నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఆర్‌.ఎల్‌.మూర్తి, ఏఐఎస్‌ఎఫ్‌ నేత పుట్టా లక్ష్మణ్, పీడీఎస్‌యూ నేత మహేశ్, డీవైఎఫ్‌ఐ నేత కోట రమేశ్, ఏఐవైఎఫ్‌ నేత వలీఉల్లా ఖాద్రీ, పీవైఎల్‌ నేత ప్రదీప్‌లు మాట్లాడారు. పరీక్షల అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


టీజీఎంసీ రిజిస్ట్రార్‌గా లాలయ్య కుమార్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీజీఎంసీ) కొత్త రిజిస్ట్రార్‌గా డి.లాలయ్య కుమార్‌ని నియమించినట్లు టీజీఎంసీ గురువారం తెలిపింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్‌ చేసిన లాలయ్య తర్వాత ఐఆర్‌ఎస్‌కు ఎంపికై వివిధ హోదాల్లో కొనసాగి పదవీ విరమణ చేసినట్లు పేర్కొంది.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులను కల్పించనున్నారు. వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) పరిధిలో పదోన్నతులు పొందినవారికి ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు వైద్య విద్య డైరెక్టర్‌ ఎన్‌.వాణి ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 200 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభిస్తాయని డీఎంఈ అధికారులు తెలిపారు.


దొడ్డి కొమురయ్యకు నివాళి

దొడ్డి కొమురయ్యకు నివాళి అర్పించిన శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌.. చిత్రంలో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్‌ మార్షల్‌ కరుణాకర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా... గురువారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళి అర్పించారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు, సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్‌ మార్షల్‌ కరుణాకర్, శాసనమండలి, శాసనసభ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

  • దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలు.. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

జూన్‌లో యాదాద్రీశుడి ఆదాయం రూ.23.91 కోట్లు 

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఆదాయమూ అదేస్థాయిలో వస్తోందని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో దేవస్థానంలోని వివిధ విభాగాల ద్వారా రూ.23.91 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది ఇదే జూన్‌లో వచ్చిన రూ.16.36 కోట్లతో పోలిస్తే ఇది రూ.7.55 కోట్లు అధికమని ఈవో గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.


317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యోగుల సంఘం తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 317 జీవోతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేసి స్థానికతను కోల్పోకుండా సొంత జిల్లాలకు పంపాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. సంఘం కేంద్ర కార్యాలయంలో గురువారం అత్యవసర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ జి.నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పెండింగ్‌ డీఏలను ఇవ్వాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఛైర్మన్‌ చిలగాని సంపత్‌కుమారస్వామి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.


గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా సర్వేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా సర్వేశ్వర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఐఏఎస్‌ బదిలీల్లో భాగంగా గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈవీ నరసింహారెడ్డి పాఠశాల విద్యాశాఖకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డికి ఇన్‌ఛార్జిగా బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది.


నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

యువజన, విద్యార్థి సంఘాల ఐకాస కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్స్‌ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సమస్యలు పరిష్కరించి, వెంటనే ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని యువజన, విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది. నిరుద్యోగులతో చర్చించి సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు వలీవుల్లా ఖాద్రీ, ధర్మేంద్ర, కోటా రమేశ్, కేఎస్‌ ప్రదీప్, మూర్తి, లక్ష్మణ్, పి.రామకృష్ణ, నాగేశ్వర్‌రావు, మల్లేశ్‌ తదితరులు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అభ్యర్థులకు వయోపరిమితి దాటిపోవడంతో ఇప్పటికే జారీ అయిన ఉద్యోగ ప్రకటనల్లో పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించారు. గ్రూప్స్‌ ప్రధాన పరీక్ష నిష్పత్తి 1:50పై పునరాలోచించాలని, గురుకుల అభ్యర్థులకు న్యాయం చేసి ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 


వార్డెన్‌ పోస్టుల పరీక్షకు 56శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో వసతిగృహ సంక్షేమాధికారి పోస్టులకు జూన్‌ 24 నుంచి 29 వరకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్షలకు 56.94శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు 1.45 లక్షల మంది దరఖాస్తు చేయగా, 82,873 మంది హాజరయ్యారని పేర్కొంది. జూన్‌ 30 నుంచి ఈ నెల 4 వరకు జరిగిన డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పోస్టులకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 33.72 శాతం మంది హాజరయ్యారని వివరించింది.


తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌..3 గంటలు ఆలస్యం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ నుంచి దిల్లీకి ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. కానీ, ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని ద.మ.రైల్వే గురువారం తెలిపింది.


అద్దె బస్సులకు కి.మీ.కి అదనంగా రూ.2 చెల్లించాలి

ఈనాడు, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగి అద్దె బస్సుల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, కి.మీ.కి అదనంగా రూ.2 చెల్లించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎక్కువ గంటలు పని చేయడంతో డ్రైవర్లు డ్యూటీలకు రావడం లేదని, తమ సమస్యల్ని పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి ఎండీని గురువారం బస్‌భవన్‌లో కలిసి విన్నవించారు.


స్థానిక’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 54 శాతానికి పెంచాలి

కేంద్ర మంత్రికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి

ఈనాడు, దిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం 54 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం దిల్లీలో ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లను పెంచుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఓ వైపు బీసీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తికి అనుగుణంగా 54 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తుంటే మరోవైపు కొన్ని రాష్ట్రాలు తగ్గించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీసీ నాయకులు నీలం వెంకటేశ్, భూపేష్‌సాగర్, అర్జున్‌సింగ్, రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.


నేడు, రేపు నల్లమలలో మంత్రి జూపల్లి అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు శుక్ర, శనివారాల్లో నల్లమల అటవీ ప్రాంతంలో అధ్యయనం చేయనున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అధ్యయనానికి వెళుతున్నారని పర్యాటక శాఖ తెలిపింది. మన్ననూర్‌లో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్, ఫర్హాబాద్‌ వ్యూపాయింట్, ఆక్టోపస్‌ వ్యూపాయింట్, మల్లెల తీర్థం, గండి రివర్‌పాయింట్, ప్రతాపరుద్రుని కోట, వజ్రాలమడుగు, రివర్‌ బోటింగ్‌ తదితర ప్రాంతాలను వీరు సందర్శిస్తారని తెలిపింది. జంతువుల సంతానోత్పత్తి కాలం కావడంతో జులై 1 నుంచి అక్టోబరు 1 వరకు నల్లమల అటవీ ప్రాంతంలోకి సందర్శకుల అనుమతిని అటవీశాఖ నిలిపివేసింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యేలు స్టడీ టూర్‌కు తమ అనుమతి తీసుకున్నారని చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ ఎలూసింగ్‌ మేరు తెలిపారు. వీరి పర్యటనలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 


నేడు టీజీపీఎస్సీ ముట్టడి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1, 2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచాలని, డీఎస్సీని మూడునెలల పాటు వాయిదా వేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్‌ సురేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడి నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే గ్రూప్‌-1,2,3 పోస్టులు పెంచాలని, మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు చేయాలన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి మద్దతు ఇవ్వాలని కోరారు. గ్రూప్‌-2లో ఉద్యోగాల సంఖ్య 2 వేలకు పెంచాలని, గ్రూప్‌-3 ఉద్యోగాలను 3 వేలకు పెంచాలని నిరుద్యోగ జాక్‌ సమన్వయ కమిటీ ప్రతినిధి సంజీవ్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని