కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముట్టడి

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది అలైడ్‌ హెల్త్‌సైన్స్‌ విద్యార్థులు మంగళవారం వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు.

Published : 03 Jul 2024 04:03 IST

సమస్యలు పరిష్కరించాలని అలైడ్‌ హెల్త్‌సైన్స్‌ విద్యార్థుల డిమాండ్‌
రిజిస్ట్రార్‌ హామీతో ఆందోళన విరమణ

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ఎదుట విద్యార్థుల ఆందోళన   

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది అలైడ్‌ హెల్త్‌సైన్స్‌ విద్యార్థులు మంగళవారం వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. వర్సిటీ లోపలికి వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించగా మట్టెవాడ పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అలైడ్‌ హెల్త్‌సైన్స్‌ కోర్సుల్లో 97 శాతం మంది ఫెయిల్‌ కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సరైన వసతులు, తరగతి గదులు, భోజనం సిబ్బంది లేకపోవడంతో పాటు పరీక్షలకు ముందు తరగతులు నిర్వహించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సరైన వసతులు కల్పించి, ఏటా అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకటించి కేటాయించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఉత్తీర్ణతకు 50 శాతం మార్కులు కాకుండా 40 శాతంగా పరిగణించాలని కోరారు. అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధుల బృందం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సంధ్యను కలసి సమస్యలు వివరించారు. రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ..డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్‌ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని