పరిహారంతో సరిపెట్టడంకాదు.. విధానాలు రూపొందించాలి

కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది.

Updated : 03 Jul 2024 04:12 IST

సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుపై నివేదికివ్వండి

‘కుక్క కాటుతో బాలల మృతి’పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. అనుపమ్‌ త్రిపాఠి వర్సెస్‌ ‘యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కారు, జాతీయ జంతు సంక్షేమ మండలిలను ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడంలేదని, వాటికి వ్యాక్సినేషన్‌ చేయడంలేదని, సరైన ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన ఎం.ఇ.విక్రమాదిత్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటోగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత నెల 29న పటాన్‌చెరులో వలస కార్మిక దంపతుల కుమారుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటననూ పరిగణనలోకి తీసుకుంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలపై సానుభూతి చూపాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా నిర్దిష్ట విధివిధానాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని