కొత్త బీటెక్‌ సీట్లు 20,500

రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్న బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే.

Published : 03 Jul 2024 08:13 IST

అనుమతిస్తారా... పెండింగ్‌లో పెడతారా? 
కోర్‌ బ్రాంచీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంలో సర్కారు
వాటిలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిమాండ్‌ ఉన్న బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే. ఇక ఓయూ, కాకతీయ వర్సిటీల్లో కలిపితే మరికొన్ని వేలు ఉంటాయి. తొలుత పది వేల వరకు కొత్త సీట్లు ఉండొచ్చని అంచనా వేసినా... ఏఐసీటీఈ అనుమతుల తర్వాత చూస్తే రెట్టింపు అవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈనెల నాలుగు నుంచి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఎనిమిదో తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలవుతాయి. అంటే కనీసం 6వ తేదీ నాటికి కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలి. దాంతో జేఎన్‌టీయూహెచ్‌ అప్పిలేట్‌ కమిటీ ఆధ్వర్యంలో రెక్టార్‌ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తదితరులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశమే వర్సిటీకి ఇన్‌ఛార్జి ఉపకులపతి కావడంతో ఆయన అఫిలియేషన్‌పై దృష్టి సారించి... అవసరమైన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. మొత్తానికి ఒకట్రెండు రోజుల్లో ప్రక్రియ కొలిక్కి వచ్చేలా ఉంది. 

ప్రభుత్వ ఆలోచన మరోలా...!

సీఎస్‌ఈ, ఐటీ, ఏఐ అండ్‌ ఎంఎల్, డేటా సైన్స్‌ తదితర బీటెక్‌ సీట్లకు భారీగా అనుమతిస్తే ప్రభుత్వం అదే స్థాయిలో బోధనా రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అదే సమస్య అయితే నాన్‌ రీయింబర్స్‌మెంట్‌ పేరిట అనుమతివ్వాలని కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే కోరాయి. అప్పుడు ప్రభుత్వంపై భారం పడదని, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులే ఆయా సీట్లను ఎంచుకుంటారని తెలిపాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం కోర్‌ బ్రాంచీలను ప్రోత్సహిస్తామని, అంతా సీఎస్‌ఈ చదివితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు ఎక్కడ నుంచి వస్తారని ఇటీవల యాజమాన్యాల సమావేశంలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలకుంది. 

కన్వీనర్‌ కోటాలో ‘కోర్‌’ సీట్లు నిండింది 46 శాతమే

కోర్‌ బ్రాంచీల్లో చేరిన వారు ఐచ్ఛికంగా ఇతర బ్రాంచీల సబ్జెక్టులను చదవొచ్చని, అలాంటి వారు అవసరమైతే సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లొచ్చని వర్సిటీలు చెబుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. కొన్నేళ్ల నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు సగం కూడా నిండలేదు. నిరుడు మూడు కోర్‌ బ్రాంచీల్లో 12,751 సీట్లుంటే... 5,838 సీట్లు(45.78%) మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక యాజమాన్య కోటాలో చేరే వారే కరవయ్యారు. వాటిని కూడా కలుపుకొంటే భర్తీ 40 శాతానికి దాటదు. సిరిసిల్ల, వనపర్తి, మహబూబాబాద్, పాలేరులోని జేఎన్‌టీయూహెచ్‌ కళాశాలల్లోని కోర్‌ బ్రాంచీల్లో చేరేవారు అతి స్వల్పంగా ఉండటం గమనార్హం. వాటిని చదివితే ఉద్యోగావకాశాలు తక్కువని, ఒకవేళ దొరికినా తక్కువ వేతనం ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ అభిప్రాయం తప్పని, మంచి ప్యాకేజీలతో తాము ఉద్యోగాలిప్పిస్తామని జేఎన్‌టీయూహెచ్, ఓయూ తదితర వర్సిటీలు చొరవ తీసుకున్నదే లేదని, అవగాహన పెంచిందీ లేదన్న విమర్శలూ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు