టీజీపీఎస్సీని స్వచ్ఛంగా తీర్చిదిద్దాం

గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్‌పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Published : 03 Jul 2024 03:16 IST

ఆగస్టు 15న ‘సీతారామ’ మొదటి విడత నీటి విడుదల: మంత్రి పొంగులేటి

పాలేరు లింక్‌ కెనాల్‌ నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

కూసుమంచి, డోర్నకల్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్‌పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలు, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలో చేపట్టిన పాలేరు అనుసంధాన కాలువ, సొరంగ కాలువ తవ్వకం, అక్విడక్ట్‌ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల పూర్తయితే మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేసి ఏడాదిన్నరలోగా సాగునీరందిస్తామని చెప్పారు. అందులో భాగంగా మొదటి దశ లిఫ్ట్‌ వెట్‌రన్‌ పూర్తి చేశామని.. రెండో దశ లిఫ్టు వెట్‌రన్‌ కూడా కొద్ది రోజుల్లో పూర్తిచేయనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసినట్లు చెప్పారు. పథకంలో భాగంగా ఏన్కూరు నుంచి రూ.100 కోట్లతో వైరా జలాశయానికి అనుసంధాన కాలువ తవ్వి 1.52 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టుతోపాటు వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టును కూడా స్థిరీకరించనున్నామని వివరించారు. అనుసంధాన కాలువ పనులు పూర్తి చేసి సీతారామ పథకం మొదటి విడతలో వైరా, లంకాసాగర్‌ జలాశయంతోపాటు అనేక చెరువులకు ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోదావరి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. పాలేరు అనుసంధాన కాలువకు సంబంధించి త్వరలోనే భూసేకరణ, సొరంగం తవ్వకం పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి కూడా నీరందించలేదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో తొలి 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌-4 వరకు, డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశామని చెప్పారు. 

త్వరలోనే రుణమాఫీ నిబంధనలు.. 

రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నిబంధనల విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. రుణమాఫీ శ్రీనివాసరెడ్డికి, రేవంత్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్‌కు అవసరమా అని ప్రశ్నిస్తూ.. అందుకు సంబంధించిన జీవో త్వరలోనే వస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని