దేవాదాయ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు

‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

Published : 03 Jul 2024 03:13 IST

విధివిధానాలు రూపొందించాలన్న మంత్రి కొండా సురేఖ

మంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న శైలజా రామయ్యర్‌. చిత్రంలో జ్యోతి, కృష్ణవేణి, హన్మంతరావు

ఈనాడు, హైదరాబాద్‌: ‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(రెడ్కో) సహకారంతో రాష్ట్రంలో సాగు చేయని, ఆర్థికంగా ఉపయుక్తంగాలేని భూముల్లో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు విధివిధానాలను రూపొందించాలి. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించడం ద్వారా భూముల పరిరక్షణతోపాటు అదనపు ఆదాయం సమకూరుతుంది. భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. దేవాలయాల ఉపరితలాలపై సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలించాలి. ఆదాయం లేని, శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల పురోగతికి కామన్‌ గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌) నిధులు వెచ్చించాలి. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద సీజీఎఫ్‌కు రూ.150 కోట్ల నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాలని నిర్ణయించాం. బోనాల సందర్భంగా దేవాలయాలను అలంకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. బోనాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో పోస్టర్‌ ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలి. 

పదోన్నతులపై మార్గదర్శకాలు

దేవాదాయ శాఖలో ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఉద్యోగులతోపాటు, బదిలీలపై త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయాలి. దేవాదాయ శాఖ పరిధిలోని లీజుల మార్గదర్శకాలను సవరించాలి. ధర్మపురి సంస్కృత కళాశాలలో సిబ్బంది నియామకాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాలి. వేములవాడ గోశాలలో కోడె దూడలు మృత్యువాత పడుతుండటంతో మిగిలిన వాటికి పౌష్టికాహారాన్ని అందించాలి’ అని మంత్రి సురేఖ ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్‌ హన్మంతరావు, అడిషనల్‌ కమిషనర్లు జ్యోతి, కృష్ణవేణి, అధికారులు, రెడ్కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, జీఎస్వీ ప్రసాద్, సీజీఎఫ్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని