వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు

పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 03 Jul 2024 03:08 IST

వ్యవసాయ మంత్రి తుమ్మల

సమీకృత ప్రయోగశాలల సముదాయ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రఘునందన్‌రావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలనూ అమలుచేస్తాం. ఈ సీజన్‌లో రాష్ట్రమంతటా విత్తనాల సరఫరా బాగున్నప్పటికీ ఒకటి రెండు కంపెనీల విత్తనాల విషయంలో కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తాయి. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. పెండింగ్‌లో ఉన్న రైతుబీమా క్లెయిమ్‌లను పరిష్కరించాలి. ఆయిల్‌పామ్‌ ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. శాస్త్రవేత్తలు, అధికారులు బృందంగా వారానికి రెండు మండలాలు సందర్శించి సలహాలివ్వాలి. ఉద్యాన పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలి’’ అని మంత్రి సూచించారు. రాజేంద్రనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఇక్కడ ఎరువుల నాణ్యత ప్రయోగశాలలో ఏటా 6,000 నమూనాలు, విత్తన ప్రయోగశాలలో 8,000, భూసార పరీక్ష కేంద్రంలో 20,000 నమూనాలు పరీక్షించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


విలీన గ్రామాలను భద్రాచలం మండలంలో కలపాలి 

సీఎం రేవంత్‌కు తుమ్మల లేఖ 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామాలను తిరిగి భద్రాచలం మండలంలో కలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు లేఖ రాశారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనమవడంతో డంపింగ్‌ యార్డుకు కూడా స్థలం లేదు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దు సమస్యలు, రవాణా, పాలనకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ ఐదు గ్రామాల వారు తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేశారు. ఈ నెల ఆరో తేదీన భేటీ దృష్ట్యా ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలన సౌలభ్యం, ప్రజాసంక్షేమం కోసం ఐదు గ్రామాలను భద్రాచలం మండలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలి’’ అని తుమ్మల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని