సంక్షిప్త వార్తలు (14)

రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్‌లో 5.2, నర్సాపూర్‌లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated : 03 Jul 2024 06:42 IST

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్‌లో 5.2, నర్సాపూర్‌లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.


317 జీఓ బాధితుల దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లోని పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తూ 317 జీఓ వల్ల స్థానచలనం అయిన ఉద్యోగుల అభ్యంతరాలపై  మంగళవారం దరఖాస్తులు స్వీకరించినట్లు ఆ సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానానికి వెళ్లిన 100 మంది వైకల్యమున్న, స్పౌజ్‌ కేటగిరీ, వితంతువులు తదితర ఉద్యోగులతో పాటు మరో 466 మంది ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించామని, వాటిని పరిశీలించి అంగీకరించడమా? లేదా తిరస్కరించడమా అనేది తేల్చి చెబుతామని ఆమె పేర్కొన్నారు.


ఏపీ అధీనంలోని ఆర్‌అండ్‌బీ ఆస్తులపై నివేదికివ్వండి 

అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో.. ఆంధ్రప్రదేశ్‌ అధీనంలో ఉన్న రహదారులు, భవనాలశాఖ ఆస్తుల వివరాలతో యుద్ధ ప్రాతిపదికన నివేదిక సిద్ధం చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి అంశాలపై సమీక్షించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆస్తుల జాబితాను సమావేశానికి ముందుగానే తయారు చేసి ముఖ్యమంత్రికి పంపాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారులతో మంత్రి హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ నగరంలోని లేక్‌వ్యూ, మంజీరా, గ్రీన్‌ల్యాండ్స్‌ అతిథి గృహాలు, మినిస్టర్‌ క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, కుందన్‌బాగ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఎమ్మెల్యే నివాస భవనాలు, అధికారుల క్వార్టర్లు ఏపీ నియంత్రణలో ఉన్నాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వీలుగా సమాచారం సిద్ధం చేయాలి’ అని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, అధికారులు గణపతిరెడ్డి, మోహన్‌నాయక్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు..

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించడంపై రిటర్నింగ్‌ అధికారి ఫిర్యాదు చేశారు. సైఫాబాద్‌ పోలీసులు గత ఏడాది కేటీఆర్‌తోపాటు ఆయనను ఇంటర్వ్యూ చేసిన గోరటి వెంకన్నపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి ప్రజాప్రతినిధుల కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎ.ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగలేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేటీఆర్‌ హాజరును కూడా మినహాయించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.


నేటి నుంచి ప్రత్యక్ష నిరసనలు

అనారోగ్యం కారణంగా దీక్ష విరమణ: మోతీలాల్‌

నిమ్మరసం తాగి దీక్ష విరమిస్తున్న మోతీలాల్‌

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేసిన ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ గాంధీ ఆసుపత్రిలో దీక్షను విరమించారు. బుధవారం నుంచి ప్రత్యక్ష పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల డిమాండ్ల కోసమే తొమ్మిది రోజులుగా అన్న పానీయాలు లేకుండా దీక్ష చేసినట్లు చెప్పారు. తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీక్ష చేయడంతో కిడ్నీ, లివర్‌ పనిచేయని పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడిగామని.. తమ సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించలేదని వాపోయారు.


చెట్ల పరిరక్షణకు ఏదైనా చట్టం ఉందా? 

రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు 

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకలో ఉన్నట్లు చెట్ల పరిరక్షణకు ప్రత్యేక చట్టం ఏదైనా తెలంగాణలో ఉందా అని ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి చట్టం ఏదైనా ఉంటే వివరాలను సమర్పించాలని ఆదేశించింది. జనాభాకు తగ్గట్టుగా చెట్ల పెంపకం ఉండటంలేదని, పార్కులకు కేటాయించిన స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటూ కె.ప్రతాప్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరాలు సమర్పించడానికి ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.


జులై విద్యుత్‌ రాయితీలకు రూ.958 కోట్ల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంధనశాఖ మంగళవారం జులై నెల విద్యుత్‌ రాయితీల కింద ట్రాన్స్‌కోకు రూ.958.33 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయానికి, ఇళ్లలో 200 యూనిట్లలోపు ఉచితంగా ఇస్తున్న కరెంటు బిల్లులకు రాయితీ పద్దు కింద ప్రతి నెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


దోస్త్‌ మూడో విడత గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ గడువును జులై 2 నుంచి 4వ తేదీ వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జులై 3 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు.


ఆర్టీసీ సర్వీసులు 2 గంటల ఆలస్యం

రూట్‌ సర్వే చేయాలని ఎండీకి వినతి 

ఈనాడు, హైదరాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ బస్సులకు రన్నింగ్‌ టైం పెంచాలని సంస్థ యాజమాన్యానికి కార్మిక సంఘం స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ‘పెరిగిన రద్దీతో ఆర్టీసీ సర్వీసులు 2 గంటలు ఆలస్యమవుతున్నాయి. అన్ని సర్వీసులకు శాస్త్రీయంగా రూట్‌ సర్వే చేయాలి. జీరో, పెయిడ్‌ టికెట్ల మధ్య ఇబ్బంది రాకుండా టిమ్‌ మెషిన్లలో మార్పులు చేయాలి. కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి’ అని సంస్థ ఎండీని కోరింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు వినతిపత్రాన్ని ఎండీ కార్యాలయంలో ఇచ్చారు.


సీజీఆర్‌ పర్యావరణ సంస్థ సభ్యులకు జాతీయ పురస్కారాలు

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీకి చెందిన పౌర సంస్థ ‘క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ’ జాతీయ అవార్డులకు కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌(సీజీఆర్‌) పర్యావరణ సంస్థ సభ్యులు ఎంపికయ్యారు. జులై 6న నల్సార్‌ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే హాజరవుతారు. పర్యావరణ జాతీయ అవార్డుకు డాక్టర్‌ కె.తులసీరావు, నూకల నరోత్తమ్‌రెడ్డి జాతీయ అవార్డుకు దిలీప్‌రెడ్డి, ప్రొఫెసర్‌ టి.శివాజీరావు జాతీయ అవార్డుకు దొంతి నర్సింహారెడ్డి, ఎర్త్‌ కేర్‌ ఎన్విరాన్‌మెంట్‌ జాతీయ అవార్డుకు డాక్టర్‌ ఎ.కిషన్‌రావు ఎంపికయ్యారు. క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ నల్సార్‌ వర్సిటీతో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సులో ‘టెక్నాలజీ లా అండ్‌ హ్యుమానిటీ’ అంశంపై భారత అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ప్రసంగించనున్నారు.


విభజన సమస్యలకు ముగింపు పలకాలి

చంద్రబాబు, రేవంత్‌ భేటీ మంచి పరిణామం: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘ఈటీవీ’తో మాట్లాడారు.. ‘ప్రభుత్వ రంగ సంస్థలు, నదీ జలాల పంపకాలు, ఉద్యోగుల విభజన తదితర సమస్యలకు తప్పకుండా ఒక పరిష్కారం లభిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కావాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామం. గతంలో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్‌ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుకున్నారు తప్ప ప్రజా సమస్యలపై, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడూ చర్చించలేదు. 6వ తేదీన జరిగే భేటీతో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. 


25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి

టీజీపీఎస్‌సీ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

నాంపల్లిలోని టీజీపీఎస్‌సీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఏబీవీపీ  మహిళా నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు 

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని నిరుద్యోగులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం టీజీ పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు ధర్నాను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పోలీసు స్టేడియానికి తరలించారు. అనంతరం విడుదల చేశారు. అంతకు ముందు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 1:100 అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేయాలని, యూపీఎస్సీ మాదిరిగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులను పెంచాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఏబీవీపీ నేతలు శ్రీనాథ్, పృథ్వీ, కళ్యాణి, శ్యామ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.


సమస్యల్లో ఉన్న పూర్వ వీఆర్వోలను రక్షించండి 

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఐకాస విజ్ఞప్తి 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామస్థాయిలో విశేష సేవలు అందించిన తమను బలవంతంగా ఇతర శాఖల్లోకి బదలాయించడంతో సర్వీసుపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నామని పూర్వ వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రజాభవన్‌లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని తెలంగాణ వీఆర్వోల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌ నేతృత్వంలో ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ రద్దు, ధరణి పోర్టల్‌ ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చిన్నారెడ్డి భరోసా ఇచ్చారని సంఘం పేర్కొంది. కార్యక్రమంలో హరాలే సుధాకర్‌రావు, పల్లెపాటి నరేష్, ప్రతిభ, మురళి పాల్గొన్నారు.


రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 

సింగరేణి సీఎండీ బలరాం 

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి పరిధిలో గనుల నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు. వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్ల (జీఎం)కు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి సంస్థ డైరెక్టర్లు, జీఎంలతో బొగ్గు ఉత్పత్తిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.  వర్షాకాలంలో ఉత్పత్తికి నష్టం వాటిల్లకుండా, గనుల్లో నిలిచిన వర్షం నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపాలని, ఒక పూట వర్షం వల్ల ఉత్పత్తి తగ్గితే, మరుసటి రోజు ఆ లోటును భర్తీ చేయాలని సూచించారు. రానున్న ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా.. కొత్తగా 10 గనుల ప్రారంభానికి సన్నాహాలు ముమ్మరం చేయాలన్నారు. మరో మూడు నెలల్లో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని