వర్సిటీల్లో సదుపాయాలు కల్పించండి

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.

Updated : 02 Jul 2024 04:42 IST

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
‘ఈనాడు’ కథనానికి స్పందన

తెలంగాణ వర్సిటీ పాత బాలుర హాస్టల్‌లో కిటికీకి అమర్చిన అద్దాలు

ఈనాడు, హైదరాబాద్‌- కూకట్‌పల్లి, పాలమూరు విశ్వవిద్యాలయం, తెవివి క్యాంపస్, న్యూస్‌టుడే: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ‘వసతుల్లేని వర్సిటీలు’ శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన కథనంపై సీఎం స్పందించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో మాట్లాడి.. వర్సిటీల్లో అవసరమైన పనులు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుర్రా వెంకటేశం సూచనల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్‌లు.. సోమవారం సాయంత్రం అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్సిటీలు, హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నిధుల సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు సమాచారం. 

అధికారుల్లో కదలిక

జేఎన్‌టీయూ రెక్టార్‌ డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం ఇంజినీరింగ్‌ కళాశాల, వసతిగృహాలను సందర్శించారు. కళాశాలలో పలువురు ఒప్పంద ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంపై మండిపడ్డారు. సమయానికి రాలేకపోతే ఉద్యోగాలు మానుకోవాలని హెచ్చరించారు. విద్యార్థుల వసతిగృహాల్లో, క్యాంటీన్‌లో పరిశుభ్రత పాటించాలని, క్యాంపస్‌లోని చెత్తాచెదారాన్ని యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందికి చెప్పారు. క్యాంటీన్‌లో ఇష్టానుసారం ఏర్పాటుచేసిన స్టాళ్లను తొలగించాలని సూచించారు. పాలమూరు వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి పలు విభాగాలతో పాటు వసతిగృహాలను పరిశీలించారు. మహిళా వసతిగృహ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ ఆదేశాలతో తెలంగాణ వర్సిటీ హాస్టళ్లను పంచాయతీరాజ్‌ ఈఈ శంకర్‌నాయక్‌ పరిశీలించారు. పాత బాలుర వసతిగృహంలో అద్దాలు పగిలిన కిటికీలకు మరమ్మతులు చేపట్టి.. కొత్తవి అమర్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని