బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి.

Updated : 02 Jul 2024 05:40 IST

కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల విజ్ఞప్తి

ఐక్యత చాటుతున్న కార్మిక సంఘాల నేతలు భాస్కర్, జె.వెంకటేశ్,
బాలరాజు, రామారావు, సూర్యం, చంద్రశేఖర్, అనూరాధ తదితరులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఆయా కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో.. దేశవ్యాప్తంగా 61 బొగ్గు గనులను వేలం వేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు గనులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 1/70 చట్టం పరిధిలో ఉన్న స్థలాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించరాదని డిమాండ్‌ చేశారు. బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జులై 5న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడతామన్నారు. 6న రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 10న సింగరేణి గనులున్న ప్రాంతాల్లో వివిధరూపాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. 17న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, హిందూ మజ్దూర్‌ సభ(హెచ్‌ఎంఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఉపాధ్యక్షురాలు అనూరాధ, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

నేరుగా సింగరేణికి అప్పగించాలి

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి.. నేరుగా సింగరేణికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. బొగ్గు గనుల వేలం ఆపాలనే డిమాండుతో ఈ నెల 5న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ధర్నాలు చేపట్టాలని నిర్ణయించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని