ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు!

ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 02 Jul 2024 04:39 IST

పెరిగిన ఖర్చులను ప్రభుత్వం భరించాలి
తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆదాయాన్ని మించి ఖర్చులున్నప్పుడు ఆ లోటును ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. భక్తుల విరాళాలు, కానుకలతో ఆలయాలను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. వేలాల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలతో ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో కొవిడ్‌ కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్సు కాలాన్ని 5 నెలల పాటు పొడిగించాలంటూ తీర్పును వెలువరించింది. 292 రోజుల లైసెన్సు కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా.. చీరలు, జాకెట్‌ ముక్కలు, కొబ్బరిచిప్పల సేకరణ నిమిత్తం మహంకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి గత ఏడాది మార్చి 3న జారీచేసిన టెండరు నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఎన్‌.నవీన్‌కుమార్, మరొకరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 వరకు పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, అయితే కొవిడ్‌ కారణంగా దుకాణాలను మూసివేయడంతో 292 రోజులు పొడిగిస్తూ 2021 డిసెంబరు 17న ప్రభుత్వం మెమో జారీ చేసిందని, దీన్ని అమలుచేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనికి విరుద్ధంగా ఈవో టెండరు నోటిఫికేషన్‌ జారీ చేశారన్నారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లకు ఇచ్చిన గడువు కంటే అదనంగా.. 2023 ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు కొనసాగించినట్లు తెలిపారు. మళ్లీ పొడిగించాలనే కోరే హక్కు లేదన్నారు. 2020 జూన్‌ నుంచి అక్టోబరు 30 దాకా ఆలయం తెరిచే ఉందని టికెట్ల విక్రయానికి సంబంధించిన మెమోను పరిశీలించాలన్నారు. రూ.32 లక్షలు పిటిషనర్లు చెల్లించిన పక్షంలో కొనసాగించడానికి అభ్యంతరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆదాయం పెంచుకోవడానికి అధికారులు అనుసరిస్తున్న చర్యల కారణంగా అవి వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ కొవిడ్‌ కారణంగా దుకాణాలను మూసివేశారని, 2020లో ఆలయాలు తెరిచినట్లు దేవాలయ అధికారులు సమర్పించిన మెమోలో అధీకృత సంతకం లేదని, అందువల్ల దాన్ని ఆధారంగా పరిగణించలేమన్నారు. లైసెన్సును ఎంతకాలం పొడిగించాలనే లెక్కలపై భిన్న వాదనలున్నాయని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 5 నెలలపాటు పిటిషనర్ల లైసెన్సును పొడిగించాలని ఈవోను ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని