‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన

భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది.

Published : 02 Jul 2024 04:49 IST

మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన నేతల అరెస్టు 

విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారాంను అరెస్టు చేసి, వాహనంలో తరలిస్తున్న పోలీసులు

గాంధీ ఆసుపత్రి, కేశవగిరి, న్యూస్‌టుడే: భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరుద్యోగ ఐకాస నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ గాంధీ ఆసుపత్రిలో చేస్తున్న నిరాహార దీక్ష సోమవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ నేతలు ఆయనతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో ముందుజాగ్రత్తగా పోలీసులు సోమవారం ఆసుపత్రి ఎదుట బలగాలను మోహరింపజేసి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, సిబ్బంది, రోగులను మాత్రమే లోనికి అనుమతించారు. మోతీలాల్‌కు మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా లోనికి వెళ్లేందుకు ఆసుపత్రి గేటు దూకారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, బల్మూరి వెంకట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అక్కడికి చేరుకున్న భారాస జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్, నాయకులు బక్క జడ్సన్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు. ఎమ్మెల్యే పల్లాను పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్‌ నాయక్‌ను పరామర్శించేందుకు వస్తే పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఎన్నికల సమయంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని... రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్కలు స్వయంగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పొందుపర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని నెరవేర్చాలని కోరితే అరెస్టు చేయడం సరికాదని, సీఎం రేవంత్‌ వచ్చి మోతీలాల్‌తో చర్చించాలని డిమాండ్‌ చేశారు. 

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల విషయంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళ్లిన నిరుద్యోగ యువతపై గాంధీ హాస్పిటల్‌ వద్ద పోలీసులు లాఠీఛార్జీ చేయడమేంటని ప్రశ్నించారు. ‘‘నిరుద్యోగ యువకుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఘీభావం తెలుపుతున్న యువతను, ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలి. దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళ్లిన పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని