కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదుకు ‘ఎస్‌వోపీ’

రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

Published : 02 Jul 2024 04:37 IST

దర్యాప్తు అధికారుల సందేహాల నివృత్తికి ప్రత్యేక కేంద్రం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఐపీసీ, సీఆర్పీసీ, ది ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం ప్రకారం కేసులను నమోదు చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్‌వోపీ)తో కూడిన బుక్‌లెట్‌ను రూపొందించారు. డీవోపీ(డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌), సీఐడీలు సంయుక్తంగా రూపొందించిన ఈ ఎస్‌వోపీని అన్ని ఠాణాల దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉంచారు. డీవోపీ జి.వైజయంతి, సీఐడీ చీఫ్‌ శిఖాగోయెల్‌తోపాటు ఉమ్మడి కార్యాచరణ బృందం అధికారులు కల్మేశ్వర్‌ సింగెనవార్‌(నిజామాబాద్‌ కమిషనర్‌), రితీరాజ్‌(ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌)లు బుక్‌లెట్‌ తయారీ ప్రక్రియను పర్యవేక్షించారు. కేసుల నమోదులో దర్యాప్తు అధికారులకు ఉపకరించేందుకు డీజీపీ కార్యాలయంలో ‘ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌’ను సోమవారం ఉదయం 8 గంటలకు డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. పోలీస్, న్యాయ, ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణతో కూడిన ఈ కేంద్రం ఇకపై 24 గంటలపాలు అందుబాటులో ఉంటుంది. దర్యాప్తు అధికారులు తమ సందేహాలపై ఈ కేంద్రంలోని నిపుణులను సంప్రదించొచ్చు. మరోవైపు కొత్త చట్టాలతోపాటు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌(సీసీటీఎన్‌ఎస్‌)లో వచ్చిన మార్పుల గురించి రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు శిక్షణ ప్రారంభించారు. శిక్షణ విభాగం అదనపు డీజీపీ అభిలాషబిష్త్, సాంకేతిక విభాగం అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు దీన్ని పర్యవేక్షిస్తారు. ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో రైల్వేస్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్, మల్టీజోన్‌-1, 2 ఐజీ సుధీర్‌బాబు, ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఐజీ ఎం.రమేశ్, కోఆర్డినేషన్‌ డీఐజీ గజరావు భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని