జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్‌!

పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు సవరణ)తో చెక్‌పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి.

Published : 02 Jul 2024 04:47 IST

ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్యుల పరిశోధన

ఎల్వీపీఈఐ పరిశోధక బృందంతో డాక్టర్‌ ఇందుమతి (ఎడమ నుంచి నాలుగో వ్యక్తి)

ఈనాడు, హైదరాబాద్‌: పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు సవరణ)తో చెక్‌పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా నేత్ర సంబంధిత వ్యాధులకు జన్యు సవరణతో అడ్డుకట్ట వేయవచ్చని భారత శాస్త్రవేత్తలు నిరూపించారు. దిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ, హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్యసంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. పరిశోధన అంశాలు ‘నేచర్‌ కమ్యునికేషన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ మేరకు చిన్నతనంలోనే తీవ్రమైన దృష్టి లోపానికి దారితీసే ‘లెబెర్స్‌ కాంజినేటల్‌ అమౌరోసిస్‌ టైప్‌2’ అనే అరుదైన, జన్యుపరమైన కంటి వ్యాధికి జన్యు సవరణతో అడ్డుకట్ట వేయవచ్చని నిరూపించారు. ఇందులో భాగంగా ‘ప్రాన్సిసెల్లా నోవిసిడా’ అనే బ్యాక్టీరియా నుంచి ఒక సీఏఎస్‌9 ప్రొటీన్‌ను తీసుకొని దానిని మెరుగుపర్చి ఈఎన్‌ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 అనే మరింత కచ్చితమైన, సమర్థమైన వేరియంట్‌ను రూపొందించారు. ఈ ప్రొటీన్‌ను కంటి వ్యాధికి కారణమయ్యే జన్యువు సవరణకు ఉపయోగించారు. ఇందులోభాగంగా ఇప్పటికే ఈ వ్యాధితో బాధపడుతున్న రోగి చర్మ కణాలను తీసుకొని కొత్తగా రూపొందించిన ఈఎన్‌ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 ప్రొటీన్‌తో మూలకణాలను పునర్‌వ్యవస్థీకరించారు. దీంతో కంటి వ్యాధికి కారణమయ్యే జన్యువు సవరణను విజయవంతంగా చేశామని, ఫలితంగా వ్యాధిని తగ్గించవచ్చని ఎల్వీపీఈఐ వైద్యులు డాక్టర్‌ ఇందుమతి తెలిపారు. ప్రస్తుతం ల్యాబ్‌లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, త్వరలో రోగులపై దీనిని పరీక్షించనున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని