చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం

పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

Published : 02 Jul 2024 04:45 IST

మంత్రి సీతక్క

స్మృతివనం నమూనా

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ గౌష్‌ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాలతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి గిరిజన అమరవీరులకు మంత్రి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్మారకార్థం నిర్మించే స్మృతివనం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులు, రాయిసెంటర్‌ల సార్‌మెడిలు, పటేల్‌లను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అమరవీరుల స్మారక స్తూపం వద్ద స్మృతివనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఈ నిధులు సరిపోని పక్షంలో ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి ప్రత్యేకంగా మంజూరు చేస్తామని తెలిపారు.

స్మృతివనం నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క. చిత్రంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా,
ఎస్పీ గౌష్‌ ఆలం, కలెక్టర్‌ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులు

జోడేఘాట్‌లోని కుమురం భీం మ్యూజియంను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇంద్రవెల్లిలో అమరులైన వారి కుటుంబాలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రత్యేకంగా జీవో తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనం నిర్మించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి గిరిజనులకు గుర్తింపు ఇచ్చిందన్నారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ.. స్మృతివనం నాలుగు నెలల్లో పూర్తి చేయిస్తామన్నారు. అనంతరం స్మృతివనం నమూనాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఆదిమ గిరిజనుల ఏపీవో కుడ్మేత మనోహర్, ఆర్డీవో జీవకర్‌ రెడ్డి, డీఎస్పీ నాగేందర్‌ గౌడ్, ఈఈ రాఠోడ్‌ భీంరావు, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్, జిల్లా మేడి మెస్రం దుర్గు, కాంగ్రెస్‌ నాయకులు సత్తు మల్లేష్, ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని