బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట

పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Published : 02 Jul 2024 04:43 IST

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసడ్డి

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో జ్యోతి బుద్ధప్రకాశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో వీటికి ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం సచివాలయంలో గృహ నిర్మాణంపై అధికారులతో మంత్రి శ్రీనివాసరెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ‘‘మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 గృహాలు నిర్మిస్తాం. ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 22,500 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సోమవారం జరిగిన సమావేశంలో కోరాం. రూ.7,740 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ పథకాన్ని భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తర్వాత వారం రోజులకే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో పథకాన్ని తక్షణం అమలు చేయలేకపోయాం. ఆ పథకం అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నాం. పేదలు ఆత్మగౌరంతో బతకాలన్న ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా పనిచేయాలి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలి. గత భారాస ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రెండు పడక గదుల ఇళ్లను ఎన్ని నిర్మించింది? ఎంతమంది లబ్ధిదారులకు అందజేసింది? నిర్మాణ దశలో ఎన్ని ఉన్నాయి? తదితర వివరాలతో పూర్తిస్థాయి సమాచారం రూపొందించాలి’ అని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని