సంక్షిప్త వార్తలు (8)

ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్‌ పెమ్మసాని రాజేంద్రప్రసాద్‌ నియమితులయ్యారు.

Updated : 02 Jul 2024 06:06 IST

ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పీఆర్‌ ప్రసాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్‌ పెమ్మసాని రాజేంద్రప్రసాద్‌ నియమితులయ్యారు. జాతీయ ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎయిర్‌ మార్షల్‌ జగ్‌జీత్‌ సింగ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పీఆర్‌ ప్రసాద్‌ జులై 1, 2024 నుంచి జూన్‌ 30, 2027 వరకు కొనసాగనున్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్‌ విధి నిర్వహణలో భాగంగా శ్రీనగర్‌లోని అవంతీపూర్, అసోం, మేఘాలయ, దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌ వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు.


ప్రభుత్వ సలహాదారుగా శ్రీనివాసరాజు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌.శ్రీనివాసరాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల రూపకల్పన, అమలుతోపాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత పథకం కింద చేపట్టే ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


వన మహోత్సవం ప్రణాళిక రూపొందించండి: సురేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్, పీసీబీ సభ్య కార్యదర్శిగా జి.రవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వారు మంత్రి సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.


డిస్కంలో నలుగురు ఎస్‌ఈల బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ డిస్కంలో పనిచేస్తున్న నలుగురు పర్యవేక్షక ఇంజినీర్‌(ఎస్‌ఈ)లను పరిపాలనా కారణాలతో బదిలీ చేస్తూ సీఎండీ ముషారఫ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌ఈ పి.వి.రమేశ్‌ను మహబూబ్‌నగర్‌కు, హైదరాబాద్‌ సెంట్రల్‌ విభాగం ఎస్‌ఈ బ్రహ్మంను హబ్సిగూడకు, సిద్దిపేట జిల్లా ఎస్‌ఈ మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌ సెంట్రల్‌ విభాగానికి, హైదరాబాద్‌ దక్షిణ విభాగం ఎస్‌ఈ ఖాజా అబ్దుల్‌ రహమాన్‌ను ప్రధాన కార్యాలయానికి బదిలీచేసినట్లు సీఎండీ తెలిపారు. 


పవర్‌గ్రిడ్‌ దక్షిణ భారత సీజీఎంగా అఖిలేష్‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పవర్‌గ్రిడ్‌ సంస్థ దక్షిణ భారత రాష్ట్రాల చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం)గా అఖిలేష్‌ పాఠక్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో పవర్‌గ్రిడ్‌ విద్యుత్‌ లైన్ల వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు. 


ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పనులకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టుల నిర్మాణాలకు ఈ ఏడాది ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఆమేరకు ప్రాజెక్టులకు బడ్జెట్‌ కేటాయింపులపై సీఈలు అంచనాలు తయారు చేస్తున్నారు. శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సోమవారం వనపర్తి, నాగర్‌కర్నూల్, గజ్వేల్, సంగారెడ్డి, రామగుండం, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ సర్కిళ్ల సీఈలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రాధాన్యం కింద గుర్తించిన ప్రాజెక్టుల పూర్తికి కేటాయింపుల అంచనాలు పంపేందుకు సీఈలకు ప్రత్యేకంగా నమూనాను అందజేశారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసేందుకు వీలుగా ప్రతిపాదనల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరిచ్చే నిర్మాణాలకు సైతం పెద్దపీట వేస్తున్నారు. మంగళవారం మరికొన్ని సర్కిళ్ల సీఈలతో సమీక్ష జరగనుంది. 


ఎక్సైజ్‌ అధికారులకు కొత్త చట్టాలపై అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: నార్కొటిక్‌ డ్రగ్స్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టంలో సంతరించుకున్న మార్పులపై ఎక్సైజ్‌ అధికారులకు సోమవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో (టీజీన్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య, ఇతర నిపుణులు జూమ్‌ యాప్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడే సెక్షన్లతో నమోదయ్యే కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాంటి కేసుల్లో వాంగ్మూలాల నమోదును వీడియోగ్రఫీ తీసి న్యాయస్థానానికి సమర్పించడంపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 139 ఎక్సైజ్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతోపాటు ఎస్టీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి శిక్షణను పర్యవేక్షించారు.


జంతు నిర్వహణ నిబంధనల అమలుపై హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: జంతువుల రవాణాకు, వాటి నిర్వహణకు సంబంధించి 2017లో రూపొందించిన నిబంధనల అమలుపై ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. పశువులు, జంతువుల రవాణా సమయంలో నిబంధనలను అమలు చేయడంలేదంటూ అందిన లేఖను న్యాయస్థానం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.  నిబంధనల అమలుపై వివరణ ఇవ్వాలంటూ హోం, రవాణా, పశుసంవర్ధక శాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీ, రవాణాశాఖ కమిషనర్, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని