వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి

రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

Published : 02 Jul 2024 06:07 IST

నీట్‌పై ఆరోగ్యకర చర్చ జరగాలి
మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల ద్వారా రోగులకు అందే సేవలపై పూర్తి స్పష్టత ఉండేలా.. పటిష్ఠ పర్యవేక్షణ కొనసాగేలా తమ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి ద్వారా అందే వైద్య సేవలను పూర్తిగా జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమాలతో అనుసంధానం చేసి డీఎంహెచ్‌ఓలను బలోపేతం చేస్తామని తెలిపారు. సోమవారమిక్కడ మంత్రి విలేకరులతో మాట్లాడారు. డాక్టర్స్‌ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ రాయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని వైద్యులకు అవార్డులు ఇస్తామన్నారు. నీట్‌ను రద్దు చేయాలా? కేంద్రమే నిర్వహించాలా? ఆ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలా..? అన్న అంశంపై ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్షనైనా.. నిర్వహించుకునే శక్తి తమకూ ఉందని రాష్ట్రాలు పేర్కొంటున్నాయన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో శాఖాధిపతుల ప్రక్షాళన జరుగుతోందని, నిర్ణయాలు త్వరలోనే ఉంటాయని, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. జూడాల సమస్యలు 95 శాతం పరిష్కరించామని.. వారికి ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్‌ భవనాలకు శంకుస్థాపన చేసి, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న మానవ వనరుల మధ్య సమతుల్యత లోపించిందని.. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  కొత్త వైద్య కళాశాలలు ఈ ఏడాది వస్తాయన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని