అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ నేడు

అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానునున్నట్లు సమాచారం.

Published : 02 Jul 2024 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానునున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొంటారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సీఎస్‌ కార్యాలయం నుంచి అన్ని శాఖల కార్యదర్శులకు సోమవారం చేరవేశారు. అయితే మంగళవారం ఏ సమయంలో నిర్వహిస్తారనే స్పష్టత ఇవ్వలేదు. శాఖల వారీగా సంబంధిత అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా పనితీరును, నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రితో యంగోన్‌ సంస్థ ఛైర్మన్‌ భేటీ 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సోమవారం యంగోన్‌ కార్పొరేషన్‌ సీఈవో, ఛైర్మన్‌ కిహాక్‌ సంగ్‌ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సీఎం వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, యంగోన్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

క్యాన్సర్‌ బాధిత బాలుడి చికిత్సకు ఆర్థిక సాయం 

వరంగల్‌లో తాను క్యాన్సర్‌ బాధిత బాలుడు మహమ్మద్‌ అదిల్‌ అహ్మద్‌ను కలవలేకపోవడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం సూచనలతో ఆయన ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌ బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అదిల్‌ అహ్మద్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓఎస్డీ ఆరా తీశారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మరింత సాయం అందిస్తామని అదిల్‌ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నెల రోజుల క్రితం అదిల్‌ అహ్మద్‌ చికిత్స కోసం సీఎం పేషీ రూ.లక్ష ఎల్వోసీ మంజూరు చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని