వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!

ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి.

Published : 02 Jul 2024 06:10 IST

శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో మళ్లీ పాడైన 4వ యూనిట్‌
రూ.68 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం
ఆ గుత్తేదారు కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన జెన్‌కో
కొత్తగా టెండర్లు పిలిచినా ఈ వానాకాలంలో ఉత్పత్తి కష్టమే
ఈనాడు - హైదరాబాద్‌

శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పాడైన 4వ యూనిట్‌ 

ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కోదాని స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లు. అగ్నిప్రమాదంతో 2020లో ఈ ప్లాంటులో 4వ యూనిట్‌ కాలిపోయింది. మొత్తం రూ.68 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2022లో తిరిగి కరెంటు ఉత్పత్తి ప్రారంభించినా..80 గంటలు పనిచేశాక వైండింగ్‌ కాలిపోయింది. ఏడాదిలోగా పాడైతే మరమ్మతులు చేసిన గుత్తేదారు కంపెనీనే ఉచితంగా రిపేరు చేసి ఇవ్వాలనే ఒప్పందంతో పనులు అప్పగించారు. కానీ తాము బాగు చేసిన తరవాత వెంటనే ఉత్పత్తి ప్రారంభించకుండా ఆలస్యంగా ఆన్‌ చేసినందున తిరిగి వైండింగ్‌ ఉచితంగా చేసి ఇవ్వలేం అని కాంట్రాక్టు కంపెనీ సతాయించింది. ఎలాగైనా ఉచితంగా చేయించాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆరునెలలుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ జెన్‌కో తాజాగా ఆదేశాలిచ్చింది. మళ్లీ రిపేరు చేయాలంటే రూ.2 కోట్ల వరకూ వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా.

వార్షిక మరమ్మతులు వేసవిలోనే పూర్తిచేసి ఉంటే...

సాధారణంగా జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో జులై నుంచి డిసెంబరు దాకా కరెంటును ఉత్పత్తి చేయడం ఆనవాయితీ. గతేడాది(2023)లో వర్షాలు లేక శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. ఆ పరిస్థితుల్ని వినియోగించుకుని మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు వర్షాకాలంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాదాపుగా ఆ అవకాశం లేకుండా పోయింది. వెంటనే టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించాలని విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క జెన్‌కో అధికారులను ఆదేశించారు. ఇంతకాలం జెన్‌కో సీఎండీగా ఉన్న రిజ్వీని ప్రభుత్వం బదిలీ చేయడంతో బుధవారం ఇన్‌ఛార్జి సీఎండీగా రొనాల్డ్‌రాస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మళ్లీ పనులన్నీ పరిశీలించి.. టెండర్లు పిలిచి.. కాంట్రాక్టు అప్పగించి.. పనులు చేయించేసరికి కనీసం 2 నెలలకు పైగా సమయం పడుతుందని విద్యుత్‌ ఇంజినీర్ల అంచనా. ఆ పరిస్థితుల్లో 4వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి కష్టమేనని వారు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో సైతం 120 మెగావాట్ల యూనిట్‌ రిపేరు చేయాల్సి ఉంది. వార్షిక మరమ్మతులు వేసవిలోనే చకచకా పూర్తిచేసి ఉంటే ప్రస్తుత వానాకాలంలో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి జరిగేది. రాష్ట్రంలో కరెంటు కొరత కారణంగా డిమాండు ఉన్న సమయంలో ఒక్కో యూనిట్‌ను ఇంధన ఎక్స్ఛేంజీలో రూ.6 నుంచి రూ.10 వరకూ వెచ్చించి డిస్కంలు కొంటున్నాయి. గతేడాది(2023-24) వరదలు లేక కేవలం 1,500 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. అంతకుముందు ఏడాది(2022-23)లో తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 6,500 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి అయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని