సింగరేణి.. మొక్కల గని..!

అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా.

Published : 01 Jul 2024 04:26 IST

అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. కానీ అదే వాస్తవం. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలోనే కాదు పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలుస్తోందనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, భూపాలపల్లి జిల్లాల్లో 11 ఏరియాల్లో సింగరేణి గనులు విస్తరించాయి. వాటి పరిధిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టిన ప్రాంతాలు, కార్మిక వాడలు, ఉపరితల గనుల తవ్వకాల ద్వారా వెలికి తీసిన మట్టి కుప్పలపై ఏటా వర్షాకాలంలో 10 లక్షలకు పైగా మొక్కలు నాటుతోంది. నాటిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తున్న సంస్థ ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తోంది. మొక్క పెరిగే విధానం ఆధారంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తోంది. ఆయా ప్రాంతాల్లోకి పశువులు, ఇతర జీవాలు వెళ్లకుండా చుట్టూ కందకాలు తవ్వడం, చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతోంది. 2000 సంవత్సరం నుంచి విస్తృతమైన ఈ క్రతువు ద్వారా 14,000 హెక్టార్లలో ఆరు కోట్ల మొక్కలు ఏపుగా పెరిగి అటవీ క్షేత్రాలను తలపిస్తున్నాయి. ఈ విషయమై సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం మాట్లాడుతూ, ‘గనులు విస్తరించిన ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఇలాంటి చర్యలు దోహదం చేస్తాయి. ఈ వర్షాకాలంలో మరో 15 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు.

న్యూస్‌టుడే, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని