‘సీతారామ’లో కొనసాగుతున్న సొరంగం పనులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సొరంగం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి.

Published : 01 Jul 2024 03:17 IST

ఏడాదిన్నరలో 8 కి.మీ. పూర్తిచేయాలన్నది లక్ష్యం

తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద టన్నెల్‌ పనులను పరిశీలిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారి రమేశ్‌

ఖమ్మం-ఈనాడు-తిరుమలాయపాలెం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సొరంగం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుగా ఉన్న కూసుమంచి మండలంలోని ‘పాలేరు జలాశయం’ ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఆయకట్టుకు నీరందిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్‌ కెనాల్‌ నిర్మిస్తున్నారు. రూ.433 కోట్ల వ్యయంతో సీతారామ ప్రధాన కాలువ 113వ కిలోమీటరు నుంచి 75 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపడుతున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నం.16లో 8 కిలోమీటర్ల మేర సొరంగం కాలువ (టన్నెల్‌) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి మరో 4 కిలోమీటర్లు కాలువ తవ్వకం చేపట్టి పాలేరు జలాశయానికి అనుసంధానిస్తారు. ఎనిమిది కిలోమీటర్ల సొరంగ కాలువను గత కొన్ని రోజులుగా రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తున్నారు. దమ్మాయిగూడెం వద్ద ఇప్పటికే 420 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. రాతిబండ కావడంతో బ్లాస్టింగ్‌ తప్పనిసరి అవుతోంది. 8 కి.మీ. టన్నెల్‌ తవ్వకం ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏడాదిలోనే పూర్తి చేసేందుకు మరో ఆడిట్‌ కేంద్రం(తవ్వకం పాయింట్‌) ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి.


దమ్మాయిగూడెం వద్ద కొనసాగుతున్న సొరంగం తవ్వకం పనులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని